ఆయనో రాష్ట్ర మంత్రి. కేబినెట్ సహచరులకు ఎవరికీ లేని విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. అది కూడా సొంత శాఖ నుంచేనట. చివరకు అధికారులను పిలిచి సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారట మంత్రిగారు. ఇంతకీ అమాత్యులవారి కోపానికి కారణం ఏంటి? అధికారులు ఏం చేస్తున్నారు?
రాజకీయాల్లో కులం అంతర్భాగంగా మారింది. సామాజిక సమీకరణాల లెక్క తేలకుండా పార్టీలు ముందుకు వెళ్లే పరిస్ధితి లేదు. ఇదంతా ఎన్నికలు.. పార్టీ వ్యవహారాల వరకు బాగానే వర్కవుట్ అవుతాయి. కానీ, అధికారిక కార్యక్రమాలు, ప్రొటోకాల్ దగ్గరకు వచ్చేసరికి “ఫలానా” అనే ప్రస్తావన రావడం ఎవరికైన ఇబ్బందికరంగానే ఉంటుంది. సరిగ్గా అటువంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్కు సొంత శాఖ నుంచే విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. సమస్య చిన్నదిగా కనిపించినా.. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో మార్పు రాకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారట. తన పేరు చివరన ఎటువంటి సందర్భం, అవసరం లేకుండానే “రెడ్డి”అని జోడించి అఫీషియల్‌గా నోట్స్ రిలీజ్ అవ్వడం మంత్రికి ఇబ్బందిగా మారింది. పేరు చివరన ఆ తోకలు ఎందుకు.. పైగా లేనివి ఎందుకు జోడిస్తున్నారు అని కొందరు సీనియర్ అధికారులను పిలిచి క్లాస్ తీసుకున్నారట.
అమర్నాథ్ పేరు వెనక రెడ్డి జోడించడం వెనక బలమైన కారణాలు లేకపోలేదన్నది కొందరు చెప్పేమాట. మంత్రికాక ముందు అమర్నాథ్ వైసీపీ అధికార ప్రతినిధి. తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. ఆ సందర్భంలోనే అమర్నాథ్ పేరు చివరన రెడ్డి అని తగిలించేయడం.. ఆయన స్వయంగా ఫోన్ చేసి వాటిని తీసేయాలని కోరిన ఉదంతాలు ఉన్నాయి. అప్పట్లో ఇదంతా ప్రైవేట్ వ్యవహారం కావడంతో సీరియస్‌గా తీసుకునేవారు కాదు అమర్నాథ్. కానీ.. ఇప్పుడు మంత్రి. అధికారిక కార్యక్రమాల్లోనూ తనను అమర్నాథరెడ్డిగా సంభోదించడం ఆయనకు మింగుడు పడటం లేదట.
ఈ నెల 16న అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో నెలకొల్పిన ATG టైర్ల కంపెనీని అమర్నాథ్ ప్రారంభించబోతున్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో ఏర్పాట్లు అన్నీ తానై చూస్తున్నారట. ఈ క్రమంలోనే అతిథుల ఆహ్వానాలపై చర్చ జరిగినప్పుడు.. తన పేరు చివరన రెడ్డి చేర్చవద్దని.. మంత్రి కోరారట. తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈవో, జపాన్ ప్రతినిధులు తనను అమర్నాథ్రెడ్డిగా సంభోదించడాన్ని గుర్తు చేశారట. అందుకే టైర్ల కంపెనీ కార్యక్రమంలో అలాంటి తప్పు జరగకుండా చూడాలని అధికారులను కోరారట మంత్రి. మరి.. పేరు చివరన ఈ తోక తెచ్చిన తంటా నుంచి అమర్నాథ్ బయట పడతారో లేదో చూడాలి.