నాగ వంశీ, తెలుగులో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉన్న వ్యక్తి, ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సెక్షన్ మీడియా మీద ఫైర్ అయ్యాడు. సాధారణంగా సినిమాల రివ్యూల గురించి నిర్మాతలు, దర్శకులు, అప్పుడప్పుడు నటీనటులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా నాగ వంశీ కూడా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వచ్చాడని అనుకుంటే, ఒక వర్గం మీడియాని తూర్పారపట్టాడు. సినిమా రివ్యూ ఇవ్వడం ఆ వ్యక్తి సొంత అభిప్రాయం. ఎలక్షన్ లాగా ఒక పదివేల మంది అభిప్రాయం లేక మరొకటో కాదు, అతని మూడ్‌ని బట్టి, ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి రేటింగ్, రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఒక సందర్భంలో భార్య తిట్టినా కూడా ఆ కోపంతో సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు నాకు తెలుసు అంటూ ఆయన రివ్యూ రైటర్ల గురించి కామెంట్స్ చేశాడు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, రివ్యూ నెగిటివ్‌గా ఇవ్వడంలో తప్పులేదు కానీ, ఆ నెగిటివ్ ఇచ్చిన రివ్యూను ఇంకా సమర్థించుకోవడం కోసం “వేరే సినిమాలు బాలేదు కాబట్టి మాడ్ స్క్వేర్ ఆడుతోంది, మాడ్ స్క్వేర్‌కి కలెక్షన్స్ వస్తున్నాయి కానీ వంశీ చెప్పినట్టుగా భారీ కలెక్షన్స్ రావడం లేదు” అంటూ ఇంకా నెగిటివ్ ప్రొపగాండా చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యాడు.
అంతేకాక, “వీళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు, యాడ్స్ వంటివి ఇస్తూ మేము వారిని పోషిస్తుంటే, వారు మాత్రం ఇంకా విషం కక్కుతున్నారని” అర్థం వచ్చేలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కచ్చితంగా సినిమాని చంపేసే ప్రయత్నం అని ఆయన చెప్పవచ్చు. ఒకపక్క కలెక్షన్స్ కనిపిస్తున్నా సరే, “ఎందుకు ఈ సినిమా హిట్ అని ఒప్పుకోవడం లేదు?” అని ఆయన అన్నారు. “తాను ఇంటర్వ్యూస్ ఇచ్చి, యాడ్స్ ఇస్తేనే మీ వెబ్‌సైట్స్ నడిపిస్తున్నాయి. మా మీద బతికే మీరు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మీదట తమను బ్యాన్ చేయాలని కోరాడు. “మా సినిమాల గురించి వార్తలు గానీ, మా సినిమాల రివ్యూలు గానీ రాయకండి” అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. కళ్ల ముందు కనిపిస్తున్న సరే కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై ఆయన ఫైర్ అయ్యాడు.
నిజానికి డిజిటల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా మధ్య ఇదివరకు సన్నని గీత మాత్రమే ఉండేది. ఇప్పుడు అది పెరిగి పెద్దదై, మెయిన్‌స్ట్రీమ్ మీడియాని డిజిటల్ మీడియా దాటి ముందుకు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్వ్యూల విషయంలో, యాడ్స్ విషయంలో, ఇతర ప్యాకేజీల విషయంలో సైతం మెయిన్‌స్ట్రీమ్ మీడియాని పక్కన పెట్టి, దాదాపుగా అందరూ పెద్ద నిర్మాతలు యూఎస్ బేస్డ్ వెబ్‌సైట్స్‌ని ప్రోత్సహిస్తున్నారు. అయితే, మిగతా మీడియా మొత్తం సినిమాకి ప్రమోషన్స్ చేస్తూ కాస్త పాజిటివ్‌గానే ఉంటే, ఈ వెబ్‌సైట్స్ మాత్రం ఎప్పటికప్పుడు నెగిటివ్‌గానే సినిమాలను పుష్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నాగ వంశీ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో మరికొంతమంది నిర్మాతలు వచ్చి ఈ విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలని మెయిన్‌స్ట్రీమ్ మీడియా ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్‌లో సైతం నాగ వంశీకి ఇదే ప్రశ్న ఎదురైంది. “ఈ ఆవేశం వచ్చే సినిమా రిలీజ్ టైమ్‌కి ఉంటుందా? వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆపగలరా?” అని ప్రశ్నిస్తే, “నన్నీం చేయమంటారో కూడా మీరే చెప్పండి” అంటూ నాగ వంశీ దాటవేసే పరిస్థితి కనిపించింది.