ఈ భూమి మళ్లీ ఒక మహమ్మారి కోసం సిద్ధమవుతోంది. ఇది వార్త కాదు.. ఇది ఊహ అంతకన్నా కాదు. ఇది ఒక శాస్త్రవేత్త చేసిన హెచ్చరిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్, సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
కోవిడ్ ఎలా పుట్టిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.. ఇది ల్యాబ్‌లో పుట్టిందా.. అడవిలో మొదలైందా.. లేదా మన అజ్ఞానమే దానికి జన్మనిచ్చిందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా తెలుస్తోంది. నెక్ట్స్ రానున్న వైరస్ ప్రమాదం మన ముందే తయారవుతోందంటూ భారత వైద్య పరిశోధనల్ని నడిపించిన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్(Soumya Swaminathan) బాంబు పేల్చారు. వాతావరణ మార్పు కేవలం భూమిని వేడెక్కించడం కాదు.. అది వైరస్‌లకు కొత్త దారులు తెరుస్తోందని చెప్పారు. జంతువుల నుంచి మనుషులకు.. అడవుల నుంచి నగరాలకు.. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వైరస్ వ్యాపించే పరిస్థితులను కల్పించింది మనమేనని గుర్తుచేశారు. ఇంతకీ నెక్ట్స్ ఏం జరగబోతోంది? తదుపరి వైరస్ ఎక్కడ పుట్టబోతోంది? ఈసారైనా ప్రపంచం సిద్ధంగా ఉందా..? లేదా మళ్లీ శవాల లెక్కలే మిగులుతాయా?
కోవిడ్ ఎగ్జిట్ తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఊపీరి పీల్చుకుంది. కానీ ఆ ఊపిరిలోనే ప్రమాదం దాగి ఉంది. ఎందుకంటే గత వందేళ్లలో ప్రపంచం చూసిన ప్రధాన వైరస్ మహమ్మారులన్నింటికీ ఒక కామన్ లింక్ ఉంది. అవి సహజంగా మనుషుల మధ్య పుట్టలేదు. జంతువుల నుంచి మనుషులకి పాకాయి. ఈ జంప్‌ను సైంటిస్టులు స్పిలోవర్ అంటారు. ఈ స్పిలోవర్ ఘటనలు ఇప్పుడు అరుదైనవి కావు. అవి రోజువారీ ప్రమాదాలుగా మారుతున్నాయి. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పిన మాట కూడా ఇదే. వాతావరణ మార్పు వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అటు అడవులు తగలబడుతున్నాయ్. దీని కారణంగా జంతువులు తమ సహజ నివాసాలను వదిలి మనుషుల దగ్గరకు వస్తున్నాయి. అడవుల్లో మాత్రమే ఉండాల్సిన వైరస్‌లు ఇప్పుడు గ్రామాల్ని, పట్టణాల్ని తాకుతున్నాయి. ఇది మనకి మనమే సృష్టించుకున్న పరిస్థితి.
H1N1, జికా, ఎబోలా, నిపా లాంటి వైరస్‌లు ఒక్కసారిగా పుట్టలేదు. వాతావరణ మార్పు, అడవుల నరికేయడం, అడవి జంతువుల అక్రమ వ్యాపారం లాంటివి ఈ వైరస్‌లకు వేదికయ్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి మరింత వేగంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ వైరస్‌లు మ్యూటేట్ అవుతున్నాయి. అంటే అవి కొత్త రూపాల్లో మారుతున్నాయి. పాత రోగనిరోధక శక్తిని దాటేస్తున్నాయి. ఇంకో భయంకరమైన అంశం ఏంటంటే ఈసారి మహమ్మారి ఒకే దేశంలో మొదలై అక్కడే ఆగకపోవచ్చు. వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. వరదలు, కరువులు, హీట్‌వేవ్‌ల వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోతున్నారు. ఈ కదలికలతో పాటు వైరస్‌లు కూడా ప్రయాణిస్తున్నాయి. సరిహద్దులు వైరస్‌లను ఆపలేవు. పాస్‌పోర్ట్‌లు వాటిని అడ్డుకోలేవు.
డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ మరో కీలక విషయం చెప్పారు. పేద దేశాలు ఈ సంక్షోభానికి ఎక్కువగా బలవుతున్నాయి. హెల్త్ సిస్టమ్స్ బలహీనంగా ఉన్న చోట వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. చికిత్స ఆలస్యమవుతుంది. మరణాలు పెరుగుతాయి. కోవిడ్ సమయంలో మనం ఇదే చూశాం. కానీ వాతావరణ మార్పుతో ఈ అంతరం మరింత పెరుగుతోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్య కాదు. ఇది మానవ భద్రత సమస్య. ఇంత జరుగుతున్నా ప్రపంచం ఇప్పటికీ పూర్తిగా నేర్చుకోలేదు. కోవిడ్ తర్వాత కూడా అడవులను నరకడం ఆగలేదు. కార్బన్ ఉద్గారాలు తగ్గలేదు. అంటే నెక్ట్స్ మహమ్మారికి అవసరమైన అన్ని పదార్థాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ హెచ్చరిక సాధారణ శాస్త్రీయ కామెంట్ కాదు.
ఇది మనకు ముందస్తు అలారం. ఇది ముందస్తు సైరన్. వాతావరణ మార్పు సమస్యను సీరియస్‌గా తీసుకోకపోతే, ప్రకృతితో మన యుద్ధాన్ని ఆపకపోతే, తదుపరి మహమ్మారి తప్పదని సైన్స్ హెచ్చరిస్తోంది. మరి మనుషులు, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఇప్పటికైనా ఎండ్ కార్డ్ పడుతుందా అంటే.. కష్టమే అనిపిస్తుంది!
ALSO READ: 634సార్లు ప్రయత్నించి చంపలేకపోయారు.. అమెరికాను వణికించిన విప్లవ వీరుడు!