అతని సంకల్పం అణుబాంబుల కంటే బలమైనది.. అతని తిరుగుబాటు తత్వం గాలికన్నా వేగంగా ఖండాలు దాటేది. అతని ఆలోచనలు మిస్సైళ్ల కంటే వేగంగా ప్రయాణించేవి..అతని పేరు వినగానే వైట్ హౌస్ గోడల్లో వణుకు మొదలయ్యేది. ఒక చిన్న ద్వీప దేశం.. ఆ చిన్నదేశంలో ఓ నాయకుడు అమెరికా సామ్రాజ్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురోను పట్టుకుని ఎత్తుకెళ్లామని అమెరికా ఈ రోజు గర్వంగా ప్రకటించుకుంటోంది కానీ.. ఇదే అమెరికా.. ఇదే సీఐఏ.. అదే సముద్రం అవతల క్యూబా అనే చిన్న దేశంలో మాత్రం ఒక మనిషి తలవెంట్రుకను కూడా పీకలేకపోయింది.. అతనే ఫిడెల్ క్యాస్ట్రో..!
అతను ఒక మనిషి కాదు.. ఒక తలవంచని సిద్ధాంతానికి నిలువెత్తు రూపం. అమెరికా ఫిడెల్‌ను చంపడానికి 634 సార్లు ప్రయత్నించి విఫలమైందంటే అతను ఎలాంటి నాయకుడో అర్థం చేసుకోవచ్చు. బాంబులు వేసి అనేక దేశాలను కూల్చిన అమెరికా.. ఇప్పటికీ క్యూబా భూభాగాన్ని మాత్రం టచ్ చేయలేకపోతోంది. ఎందుకంటే అక్కడ ఒక తుపాకీ కాదు.. ఒక విప్లవం రాజ్యమేలుతోంది. అందుకే బే ఆఫ్ పిగ్స్‌లో అమెరికా ఓడిపోయింది. సామ్రాజ్యవాద కాంక్షతో లాటిన్ అమెరికాను దోచుకునేందుకు అమెరికా ఎన్నిసార్లు ప్రయత్నించినా హవానాలో మాత్రం ప్రజలు దైర్యంగా నిలబడ్డారు. ఫిడెల్ ఉన్నప్పుడు అమెరికాకు ప్రణాళికలు ఉండేవి కానీ.. విజయాలే ఉండేవి కావు. అందుకే ప్రపంచాన్ని ఇప్పుడు ఒకే ప్రశ్న వేధిస్తోంది. ఒకవేళ ఫిడెల్ క్యాస్ట్రో ఇప్పుడు బతికి ఉంటే అమెరికా ఇంత దూరం వచ్చేదా? లాటిన్ అమెరికా ఇంత అల్లకల్లోలంగా ఉండేదా? అమెరికా ఇంత ధైర్యంగా ప్రపంచాన్ని తొక్కేదా?
అమెరికాకు భయం అంటే అణుబాంబులు కాదు. శత్రు దేశాల సంఖ్య కూడా కాదు. భయం అంటే నియంత్రించలేని ఒక ఆలోచన. ఆ ఆలోచనకు పేరు ఫిడెల్ క్యాస్ట్రో. ఫ్లోరిడా తీరానికి కేవలం 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం నుంచి అమెరికా సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ఏకైక నాయకుడు అతనే. వాషింగ్టన్ మ్యాప్స్‌లో క్యూబా ఒక చిన్న చుక్క మాత్రమే. కానీ పెంటగాన్ ఫైళ్లలో అది ఒక రెడ్ అలర్ట్. ఎందుకంటే అక్కడ ఆయుధాలు కాదు. తిరుగుబాటు ఆలోచనలు తయారవుతాయి.
ఫిడెల్ క్యాస్ట్రో రాజకీయాల్లోకి వచ్చేసరికి క్యూబా ఒక స్వతంత్ర దేశంలా కనిపించేది. కానీ వాస్తవానికి అది అమెరికా కంపెనీల అడ్డాగా ఉండేది. షుగర్ మిల్స్ నుంచి ఆయిల్ రిఫైనరీల వరకు 70 శాతం కంటే ఎక్కువ అమెరికా చేతుల్లోనే ఉండే రోజులవి. ఫుల్గెన్సియో బాటిస్టా అనే నియంతను అమెరికా పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఎన్నికలు అర్థం లేనివిగా సాగేవి. ప్రజలు పేదరికంలో ఉండగా హవానా క్యాసినోలు అమెరికన్ మాఫియాల చేతుల్లో నడిచేవి. ఇదే దోపిడీ వ్యవస్థపై ఫిడెల్ తిరుగుబాటు మొదలుపెట్టాడు.
1953 జూలై 26న మోంకాడా బారాక్స్‌పై జరిగిన దాడి సైనికంగా విఫలమైంది. కానీ రాజకీయంగా అది ఒక విప్లవానికి విత్తనం నాటింది. ఫిడెల్ కోర్టులో నిలబడి చెప్పిన మాటలు క్యూబా ప్రజల్లో నిప్పురవ్వలా పడ్డాయి. జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాడు. మెక్సికోలో తిరిగి ఆయుధం పట్టాడు.
1956లో ఫిడెల్ క్యాస్ట్రో మెక్సికో నుంచి గ్రాన్మా అనే చిన్న పడవలో క్యూబా వైపు బయలుదేరాడు. అతనితో కలిసి మొత్తం 82 మంది విప్లవకారులు ఉన్నారు. కానీ క్యూబా తీరానికి చేరగానే బాటిస్టా సైన్యం దాడి చేసింది. తుపాకీ మోతలో ఆ బృందం చెల్లాచెదురయ్యింది. 82 మందిలో 70 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన 12మంది విప్లవకారులు ప్రాణాలతో తప్పించుకున్నారు. వారే సియెరా అడవుల్లో దాక్కొని, ఓడిపోయిన దాడిని ఒక జాతీయ విప్లవంగా మార్చారు. అక్కడ రైతులే ఆయుధమయ్యారు. ప్రజలే రక్షణగా మారారు. చెగువేరా ఒక యోధుడిగా ఎదిగింది కూడా అక్కడే. 1958 చివరికి బాటిస్టా సైన్యం కూలిపోయింది. 1959 జనవరిలో ఫిడెల్ క్యూబా రాజధాని హవానాలోకి ప్రవేశించాడు. అది కేవలం ప్రభుత్వ మార్పు కాదు.. అది అమెరికా ఆధిపత్యానికి పడిన బహిరంగ చెంపదెబ్బ.
అమెరికా ఇది జీర్ణించుకోలేకపోయింది. అందుకే 1961లో బే ఆఫ్ పిగ్స్ దాడికి దిగింది. సీఐఏ శిక్షణ ఇచ్చిన క్యూబన్ తిరుగుబాటు దళాలు, ఆధునిక ఆయుధాలు, పూర్తిగా సిద్ధం చేసిన ప్రణాళికతో ఆపరేషన్ మొదలైంది. కానీ ఎదురుగా నిలిచింది క్యూబా సైన్యం కాదు.. క్యూబా ప్రజలే. కేవలం 72 గంటల్లోనే అమెరికా మద్దతు ఉన్న ఆ గ్రూపు పూర్తిగా కూలిపోయింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పరాజయాల్లో ఒకటిగా నిలిచింది. అంతకముందు అమెరికా షాక్ తిన్న సందర్భం ఒకటుంది. 1941లో జపాన్ చేసిన పెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ఒక్కసారిగా తన భద్రత ఎంత బలహీనంగా ఉందో గ్రహించింది. కానీ ఆ దాడి తర్వాత అమెరికా తిరిగి లేచింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలిచింది. అయితే క్యూబాలో మాత్రం అలా జరగలేదు. ఇక్కడ ఓటమికి కారణం ఆయుధాల లోపం కాదు. ప్రణాళిక లోపం కూడా కాదు. ప్రజల మద్దతుతో నిలిచిన విప్లవం ముందు సామ్రాజ్య శక్తి నిలబడకపోగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఫిడెల్ నిజమైన యుద్ధం అప్పుడే మొదలైంది. క్యూబా సోషలిస్ట్ దేశంగా మారింది. అమెరికా కంపెనీలు జాతీయమయ్యాయి. వాషింగ్టన్ కోపం మంటల్లో బూడిదైంది. 1960 నుంచి 1965 మధ్య సీఐఏ కనీసం 8 సార్లు ఫిడెల్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిందని అమెరికా సెనేట్ స్వయంగా అంగీకరించింది. కానీ క్యూబా గూఢచార సంస్థల లెక్కల ప్రకారం ఆ ప్రయత్నాలు 634సార్లు. విష సిగార్లు, పేలే పెన్లు, విషపూరిత మిల్క్‌షేకులు, స్కూబా సూట్లు, మాఫియా ఒప్పందాలు.. ఇలా ఎన్ని కుట్రలు వేసినా ఫిడెల్ బతికాడు. ఎందుకంటే అతను ఒక శరీరం కాదు. అతనోక వ్యవస్థ. అతనోక విప్లవ ఆలోచన.
మరోవైపు 1962లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. సోవియట్ యూనియన్ క్యూబాలో అణు క్షిపణులు మోహరించిందని తెలుసుకున్న అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ క్యూబా చుట్టూ నౌకా దిగ్బంధం ప్రకటించాడు. సముద్రంలో అమెరికా యుద్ధనౌకలు నిలబడ్డాయి. ఆకాశంలో యుద్ధవిమానాలు తిరిగాయి. ప్రపంచం అణు యుద్ధం అంచున నిలిచింది. కొన్ని రోజులు ప్రపంచం నిజంగానే శ్వాస ఆపుకుంది. చివరికి అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఒప్పందం కుదిరింది. క్యూబా నుంచి సోవియట్ క్షిపణులను తొలగించారు. కానీ ఈ సంక్షోభం ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది. అమెరికా తొలిసారి తన భూభాగం నేరుగా ప్రమాదంలో పడే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ భయానికి కేంద్రబిందువుగా నిలిచింది ఒకే ఒక్క చిన్న దేశం.. అదే క్యూబా. ఇదంతా జరుగుతున్న సమయంలో ఫిడెల్ క్యాస్ట్రో తలవంచలేదు. అమెరికా ఆదేశాలను అంగీకరించలేదు. తన దేశాన్ని వదల్లేదు. అణుబాంబుల భయాన్ని ఎదుర్కొని క్యూబాను నిలబెట్టాడు. అదే అతని అసలు విజయం. ఆయుధాలతో కాదు.. ధైర్యంతో సాధించిన మరో విజయం.
ఆ తర్వాత ఫిడెల్ విప్లవాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాడు. ప్రపంచమంతటా విప్లవ నినాదాలు మారుమోగాయి. ఆఫ్రికాలో అంగోలా నుంచి ఎథియోపియా వరకు.. ఆసియాలో వియత్నాం వరకు క్యూబా నిలబడింది. అమెరికా మద్దతు ఉన్న నియంతలకు ఇది అసహనాన్ని కలిగించింది. డొమినికన్ రిపబ్లిక్‌లో జువాన్ బోష్ కూలిపోయాడు. చిలీలో సాల్వడోర్ అలెండే హత్యకు గురయ్యాడు. కానీ క్యూబా నిలబడింది. కారణం అక్కడ ప్రజలు విప్లవాన్ని తమ హక్కుగా భావించారు. దీంతో అమెరికా ప్రతీకారం ఆర్థికంగా మొదలైంది. 1962లో మొదలైన ఆర్థిక ఆంక్షలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో ప్రతి సంవత్సరం 180కిపైగా దేశాలు ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాయి. అయినా అమెరికా వెనక్కి తగ్గడంలేదు. క్యూబాకు ఆర్థికంగా 130 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. అయినా క్యూబా ప్రభుత్వం కూలడంలేదు. ఇదే అమెరికాకు జీర్ణించుకోలేని విషయంగా మారింది..!
ఈ రోజు అమెరికా వెనిజులాలో నేరుగా దాడులు చేస్తూ.. ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకున్నామని గర్వంగా చెబుతోంది కానీ.. ఇదే అమెరికా ఫిడెల్ ఉన్నప్పుడు లాటిన్ అమెరికాలోని మిగిలిన దేశాల విషయంలోనూ తడబడేది. అమెరికా వెన్నులో ఇంత భయాన్ని రేపిన ఫిడెల్ క్యాస్ట్రో 90ఏళ్ల వయసులో 2016లో మరణించాడు. అయితే అతను ప్రజల్లో నాటిన ధైర్యం మాత్రం చావలేదు. లాటిన్ అమెరికాలో అమెరికా ప్రతి అడుగు వేయగానే ఫిడెల్ నీడ కనిపిస్తుంది. ఒకవేళ ఈ రోజు ఫిడెల్ క్యాస్ట్రో బతికి ఉంటే వెనిజులా ఇలా ఒంటరిగా ఉండేది కాదేమో. లాటిన్ అమెరికా ఇలా చీలిపోయే పరిస్థితికి వచ్చేది కూడా కాదేమో.
ఇక అమెరికా ఇలా నిర్భయంగా దేశాధ్యక్షులను ఎత్తుకెళ్లేదా అనే ప్రశ్న కూడా ప్రపంచాన్ని వెంటాడుతోంది. అమెరికా లాంటి సామ్రాజ్యాలు ఆయుధాలతో గెలుస్తాయి కానీ.. ప్రజలు కొన్ని దేశాల్లో విప్లవాలతో నిలబడతారు. ఫిడెల్ క్యాస్ట్రో ఇదే నిరూపించాడు. అమెరికా అనేక దేశాలను కూల్చింది కానీ.. ఈ నిమిషం వరకు కూడా క్యూబా కాలి కింద మట్టిని కూడా మట్టికరిపించలేకపోయింది..! దటీజ్ క్యాస్ట్రో!