2025 ఒక సాధారణ రాజకీయ సంవత్సరం కాదు..ఇది ఒక్క నాయకుడు ప్రపంచాన్ని ఎంతగా కుదిపేయగలడో చూపించిన సంవత్సరం. ఓటు బూత్ నుంచి వైట్ హౌస్ వరకు వచ్చిన ఆ వ్యక్తి నిర్ణయాలు దేశాల మధ్య నమ్మకాన్ని బద్దలుకొట్టాయి. స్నేహాన్ని అనుమానంగా మార్చాయి. వాణిజ్యాన్ని యుద్ధంగా మార్చాయి. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చాక కొత్త యుద్ధాలు మొదలయ్యాయి. తుపాకులతో కాకుండా టారిఫ్‌లతో, వీసాలతో, బెదిరింపులతో వార్ నడిచింది. ఇలా 2025లో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని ఎలా టార్చర్ పెట్టాయో తెలుసుకుందాం!
2025 జనవరి 20..! డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు వాషింగ్టన్లో చప్పట్లు వినిపించాయి.. కానీ అదే సమయంలో ప్రపంచంలోని అనేక రాజధానుల్లో ఒక విచిత్రమైన ఆందోళన మొదలైంది. ఇది సాధారణ రాజకీయ మార్పు కాదనే భావన అప్పుడే స్పష్టమైంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం అంటే కేవలం అమెరికా లోపలి పాలన మారడం కాదు. అది ప్రపంచం మొత్తానికి ప్రభావం చూపించే నిర్ణయాలకు ఆరంభం. అందుకే అనుకున్నదే జరిగింది. ఈ ఏడాదంతా ట్రంప్ ప్రపంచాన్ని ఒక రకమైన ఒత్తిడిలో ఉంచారు. టారిఫ్‌లు, వాణిజ్య బెదిరింపులు, వలసవాద వ్యతిరేక నిర్ణయాలు, అంతర్జాతీయ ఒప్పందాల పట్ల నిర్లక్ష్యం లాంటి అంశాలు అమెరికాతో పాటు చాలా దేశాల్లో అస్థిరతను సృష్టించాయి.
ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు ఇది ఆర్థికంగా పెద్ద పరీక్షగా మారింది. నిజానికి ట్రంప్ మాటల్లో దేశభక్తి ఉంది కానీ ఆయన చర్యల్లో ప్రపంచం నుంచి దూరమయ్యే ధోరణి కనిపించింది. మిత్రదేశాలపై కూడా అనుమానం పెంచుకున్నారు ట్రంప్. అభివృద్ధి చెందుతున్న దేశాలపై అక్కసు వెళ్లగక్కారు. వలసవాదులపై కఠినత్వం ప్రదర్శించారు. ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించాలన్న ప్రయత్నంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలాదేశాల కొంపలను కొల్లేరు చేశాయి.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మొదటి దాడి వాణిజ్య రంగంపైనే జరిగింది. అమెరికా ఫస్ట్ నినాదం ఈసారి మాటలకే పరిమితం కాలేదు. చర్యల్లోకీ వచ్చింది. టారిఫ్‌లు మళ్లీ ఆయుధాలుగా మారాయి. స్టీల్, అల్యూమినియం, ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఉత్పత్తులపై అమెరికా ఒక్కసారిగా సుంకాలు పెంచింది. ఈ నిర్ణయాలు ప్రత్యక్షంగా భారత్ లాంటి దేశాలను ప్రభావితం చేశాయి. భారత ఎగుమతులపై ఖర్చు పెరిగింది. అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన అనేక కంపెనీల లాభాలు తగ్గాయి. ఇది కేవలం వ్యాపార నష్టం మాత్రమే కాదు. రెండు దేశాల మధ్య నమ్మకాన్ని కూడా దెబ్బతీసిందని చెప్పాలి.
వాణిజ్యంతో పాటు ట్రంప్ మరోసారి వలసవాదులపై కఠిన వైఖరిని అమలు చేయడం మొదలుపెట్టాడు. H1B వీసాలపై నియంత్రణలు మరింత కఠినమయ్యాయి. సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి అయ్యింది. వీసా ప్రక్రియ ఆలస్యం కావడం, తిరస్కరణలు పెరగడం వల్ల వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు అనిశ్చితిలో పడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ కుటుంబాల్లో భయం మొదలైంది. ఉద్యోగం ఉందా లేదా అన్న ప్రశ్న కన్నా, దేశంలో ఉండగలమా అన్న ప్రశ్న పెద్దదిగా మారింది. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి వచ్చిన వలసవాదులు కూడా ఇదే భయాన్ని ఎదుర్కొన్నారు.
ఈ ఏడాది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మానవత్వం కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించాయి. అమెరికా లోపల ఓటర్లను సంతృప్తిపరిచే ప్రయత్నంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ సంబంధాలు తెగిపోతున్నాయన్న విమర్శలు పెరిగాయి. థర్డ్ వరల్డ్ దేశాలపై ట్రంప్ కామెంట్స్, విధానాలు మరింత తీవ్రంగా మారాయి. అంతర్జాతీయ వేదికలపై ఈ దేశాలను భారంగా, సమస్యగా చిత్రీకరించే ధోరణి పెరిగింది. ఇది కేవలం మాటల స్థాయిలో కాదు. సహాయ నిధుల కోతలు, ఒప్పందాల నుంచి తప్పుకోవడం, అంతర్జాతీయ బాధ్యతల నుంచి వెనక్కి తగ్గడం రూపంలో కనిపించింది.
డిప్లమసీ స్థానంలో డిక్టేషన్ అనే మాట 2025లో తరచూ వినిపించింది. నాటో మిత్రదేశాలపై కూడా ట్రంప్ ఒత్తిడి పెంచారు. UN, ప్రపంచ వాణిజ్య సంస్థ లాంటి అంతర్జాతీయ సంస్థల పట్ల ఆయన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఒప్పందాలు పరస్పర లాభాల కోసం కాకుండా, అమెరికా తక్షణ ప్రయోజనాల కోసం మాత్రమే అన్న దృష్టికోణం ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా నాయకత్వం స్థిరత్వాన్ని ఇవ్వడం కన్నా అనిశ్చితిని పెంచింది. ఈ నిర్ణయాల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడింది. మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగాయి. పెట్టుబడిదారులు నష్టాల బారినపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు తగ్గాయి. వాణిజ్య యుద్ధాల భయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక దేశం తీసుకున్న నిర్ణయం మరో ఖండంలో ఉద్యోగాలపై ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడింది. ఇది ట్రంప్ పాలనలో ప్రపంచం ఎంతగా పరస్పరంగా కలిసి ఉందో మరోసారి గుర్తు చేసిన దశగా చెప్పవచ్చు.
మరోవైపు 2025లో ట్రంప్ పాలన ప్రపంచాన్ని కలవరపెట్టిన మరో కీలక అంశం యుద్ధాల పట్ల ఆయన వైఖరి. 2025లో కొనసాగిర యుద్ధాల విషయంలో అమెరికా పాత్ర మరింత వివాదాస్పదంగా మారింది. యుక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలు యూరప్‌ను అస్థిరతలోకి నెట్టాయి. సైనిక సహాయంపై షరతులు, నిధులపై సందేహాలు యుక్రెయిన్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి. అమెరికా వెనక్కి తగ్గితే యుద్ధం ఎలా మలుపు తిరుగుతుందోనన్న భయం యూరప్ అంతటా వ్యాపించింది. ఇది ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే సంకేతంగా మారింది.
ఇటు మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ట్రంప్ తీసుకున్న వైఖరి అంతర్జాతీయ విమర్శలకు దారితీసింది. మానవ హక్కుల అంశాలపై అమెరికా మౌనం తీవ్ర చర్చకు కారణమైంది. ఈ నిర్ణయాలు మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. అదే సమయంలో ఇరాన్ విషయంలో ట్రంప్ కఠిన వైఖరి యుద్ధ భయాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఒక చిన్న తప్పు కూడా పెద్ద యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు హెచ్చరించారు.
ఇక ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా-తైవాన్ విషయంలో తీసుకుంటున్న చర్యలపై ట్రంప్ పాలన దూకుడుగా స్పందించింది. కానీ అదే సమయంలో స్పష్టమైన వ్యూహం లేకపోవడం మిత్రదేశాల్లో అయోమయాన్ని పెంచింది. దక్షిణ చైనా సముద్రం నుంచి తైవాన్ వరకు అమెరికా పాత్ర యుద్ధాన్ని అడ్డుకుంటుందా లేక మరింత రెచ్చగొడుతుందా అన్న ప్రశ్నలు ఈ ఏడాదంతా కొనసాగాయి. ట్రంప్ పాలనలో అమెరికా యుద్ధాన్ని నివారించే శక్తిగా కాకుండా, అనిశ్చితిని పెంచే శక్తిగా మారిందన్న విమర్శలు బలపడ్డాయి.
ఇటు అమెరికా లోపల మాత్రం ట్రంప్‌కు మద్దతు తగ్గలేదు. తన ఓటర్లకు ఆయన చెప్పింది ఒకటే. అమెరికా ప్రయోజనాలే ముందు.. కానీ అదే సమయంలో ప్రపంచం బయట చూస్తున్న దృశ్యం వేరే. మిత్రదేశాలు కూడా అప్రమత్తంగా అడుగులు వేయడం మొదలుపెట్టాయి. ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, కొత్త భాగస్వామ్యాలు గురించి ఆలోచనలు మొదలయ్యాయి. ట్రంప్ పాలన ప్రపంచాన్ని అమెరికా చుట్టూ తిరిగేలా చేయలేదు. ప్రపంచాన్ని కొత్త దారులు వెతుక్కునేలా చేసింది.
2025 ముగిసే సరికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచం మరింత ఊహించలేని దిశలో కదిలింది. ఇది కేవలం ఒక దేశ నాయకుడి కథ కాదు. ఇది గ్లోబల్ వ్యవస్థపై ఒక వ్యక్తి నిర్ణయాలు ఎంత ప్రభావం చూపగలవో చూపించిన సంవత్సరం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రశ్న ఒక్కటే. ఈ దిశ ఇలాగే కొనసాగితే 2026 ఎలా ఉండబోతోంది? వాణిజ్య యుద్ధాలు మరింత తీవ్రమవుతాయా? వలసవాదులపై ఒత్తిడి ఇంకా పెరుగుతుందా?మిత్రదేశాలు కూడా శత్రువులుగా మారే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న సంవత్సరం నిర్ణయించనుంది!