NRI Arrest: గృహహింస కేసులో కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (MPD) అధికారులు, సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో కలిసి దర్యాప్తు నిర్వహించి జెస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై గృహహింసకు పాల్పడటంతో పాటు, కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వు ను ఉల్లంఘించినట్లుగా జెస్వంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నివేదికల ప్రకారం, దర్యాప్తు అనంతరం జెస్వంత్‌పై కాలిఫోర్నియా పీనల్ కోడ్ సెక్షన్లు 273.5(a) జీవిత భాగస్వామిపై శారీరక గాయపరచడం, 273.6(a) కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.
సాంటా క్లారా సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి పోలీసు నివేదికలు, ప్రమాణపూర్వక పత్రాలను పరిశీలించిన తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అరెస్టు అనంతరం జెస్వంత్‌ను మొదట సాంటా క్లారా కౌంటీ మెయిన్ జైలుకు, ఆ తర్వాత ఎల్మ్‌వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. అనంతరం జెస్వంత్‌కు బెయిల్ మంజూరు కాగా, ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించిన ప్రారంభ విచారణ త్వరలో జరగనుంది.
ఈ కేసు వలస భారతీయ సమాజంలో గృహహింస అంశంపై మరోసారి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా, విదేశాల్లో ఒంటరిగా ఉంటూ హింసను ఎదుర్కొంటున్న మహిళల భద్రత, న్యాయ సహాయం వ్యవస్థలు మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఈ ఘటన తేటతెల్లం చేసిందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న NGO ప్రతినిధి తరుణి ఈ సందర్భంగా స్పందిస్తూ.. “బాధితుల భద్రత, గౌరవం, న్యాయ హక్కులు అత్యంత ప్రాధాన్యమైనవి. గృహ హింస వంటి కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందించడం సమాజానికి న్యాయం అందించే మార్గంలో కీలకమైన అడుగు. హింసను ఎదుర్కొంటున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను వెంటనే సంప్రదించాలి” అని సూచించారు. వలసదారుల సమాజాల్లో గృహహింస బాధితులకు రక్షణ, చట్టపరమైన సహాయం అందించే వ్యవస్థలను పటిష్టం చేయాలని తరుణి అభిప్రాయపడ్డారు.
AP Weather Alert: 4 రోజులు అతి భారీ వర్షాలు.. ఇంట్లోనే ఉండండని హోంమంత్రి సూచన!