హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్.. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. మహబూబ్ నగర్, బెంగుళూర్, కర్నూల్, అనంతపురం వెళ్లే వారికి ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. అలాగే.. పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణం సులభతరం కానుంది. ఈ ఫ్లైఓవర్ 6 లైన్లతో.. 4 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. రూ.799 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లైఓవర్ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అత్యంత పెద్దదిగా నిలుస్తుంది. జనం వాహన రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. ఈ ఆరు లైన్ల ఫ్లైఓవర్ ప్రారంభమైతే బెంగుళూరు నుంచి సిటీలోకి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు ఉండవు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తరువాత.. నగరంలోని కీలక జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ లేకుండా వేగంగా ప్రయాణం చేయడానికి వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, బైరమల్‌గూడ, చాంద్రాయణ గుట్ట తదితర ప్రాంతాలకు సులభంగా, వేగంగా ప్రయాణించవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, ఇంధన వాడకం కూడా తగ్గించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడం ద్వారా, ప్రజలకు సులభమైన మరియు తక్కువ సమయంతో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
Read Also: CM Revanth Reddy: క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025కి కేబినెట్ ఆమోదం..