మరో 6 నెలల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌కు భారత కెప్టెన్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీ20లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఈ క్రమంలో.. కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నపై యువరాజ్ మాట్లాడుతూ.. ”’హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. భారత్‌కు అతడు కావాలి. గాయపడిన హార్దిక్ పూర్తిగా కోలుకునే వరకు సమయాన్ని ఇవ్వాలి. అతడు కుదురుకోవాలి. అప్పుడు అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించాలి. అయితే కెప్టెన్సీ విషయానికొస్తే మనకు మరిన్ని ఆప్షన్లు ఉండాలి. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఆప్షన్లుగా భావిస్తున్నా. టీ20ల్లో టీమిండియాకు సూర్య కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. మరోవైపు గిల్ ఐపీఎల్ సారథి బాధ్యతలు అందుకోన్నాడు” అని యువరాజ్ సింగ్ అన్నాడు.
Aakash Chopra: టీ20 వరల్డ్ కప్లో ఆ జోడి ఓపెనింగ్ చేయాలి..
మరోవైపు.. కెప్టెన్‌గా రోహిత్ శర్మను యువరాజ్ సింగ్ చాలా ప్రశంసించాడు. ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో ఆడటం, 14 నెలల తర్వాత పునరాగమనం చేయడమే కారణమన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడితే పనిభారం ఎక్కువగా ఉంటుందని… జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అని చెప్పగలనని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ఎందుకంటే అతని వద్ద ఐదు ఐపిఎల్ ట్రోఫీలు ఉన్నాయి. అంతేకాకుండా.. టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్ కు తీసుకెళ్లగల సత్తా ఉందని చెప్పాడు.
టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పునరాగమనంపై యువరాజ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కుచ్ తో లోగ్ కహెంగే, లోగ్ కా కామ్ హై కెహనా’ అన్నారు. టీ20 జట్టులో రోహిత్-విరాట్ పునరాగమనం వల్ల చాలా సందడి ఉందని, యువతకు అవకాశం రావాలని కొందరు అంటున్నారు. అయితే రోహిత్-విరాట్ వంటి ఆటగాళ్లను విస్మరించలేమని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.