Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీలో హీట్ పుట్టిస్తోంది.. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు అందాయి.. మొదట కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేస్తే.. ఆ వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.. అంశం ఒకటే అయినా.. ఎవ్వరి వైఖరి వారికి ఉంది.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ రాస్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లను తయారు చేయడంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్న ఆయన. వెన్నుపోటు పొడుస్తారు, ఎన్టీఆర్ ఫొటోకు దండ వేస్తారని చంద్రబాబుపై మండిపడ్డారు.
2015, 2016, 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయో, మా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఏ రకంగా తొలగించారో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరంగా తెలియజేశామని తెలిపారు సాయిరెడ్డి.. 60 నియోజకవర్గాల్లో ఎంత మేరకు దొంగ ఓట్లు ఉన్నాయో తెలియజేశాం. చంద్రబాబ హయాంలో నమోదైన దొంగ ఓట్లు తొలగిస్తారేమోననే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చారని విమర్శించారు. సాక్ష్యాలతో సహా వివరాలను అందజేశాం. అన్ని నియమ. నిబంధనలను ఏ రకంగా చంద్రబాబు దుర్వినియేగం చేశారో తెలియజేశామన్న ఆయన.. సర్వే సంస్థల ద్వారా చంద్రబాబు అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తున్న విషయం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశామని వెల్లడించారు. చంద్రబాబు ఏ మేరకు కులవాదో కూడా తెలియచేశాం. ఓటరది ఏ కులమో నమోదు చేసే పని చేస్తున్నారు. ఓటరు ఏ రాజకీయ పక్షమో కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇవన్నీ అభ్యంతరకర మైన అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
దొంగ ఓట్లు నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుతో ఈ విషయంలో ఎవరైనా పోటీ పడగలరా..? అని ప్రశ్నించిన ఆయన.. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో విచారణ చేయమని కోరాం.. చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లు ఎన్నో చేర్చినా.. మాకు 49 శాతం ఓట్లతో ప్రజలు అధికారం అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈసారి 51 శాతం మేరకు ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు కార్డుతో ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని కూడా కోరామని తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.