Ayodhya Ramireddy: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ పద్మశాలికి ఇవ్వాలని పార్టీ భావించిందని గుంటూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఆర్కే వ్యక్తిగత పనులు ఉండటం వల్లే పార్టీకి రాజీనామా చేశారని ఆయన వెల్లడించారు. ఆర్కే అంచనాలు కాస్త ఎక్కువే ఉంటాయన్నారు. ఆర్కే తన ధర్మం తాను చేశారని.. మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారన్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి పదవి విషయంలో రాజకీయ సమీకరణాల వల్ల ఆర్కేకి ఇవ్వలేక పోయారని వెల్లడించారు. ఒక బీసీకి అవకాశం ఇవ్వటం కోసం అంత దగ్గరగా ఉన్న ఆర్కేను త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్‌కు ఆర్కే అత్యంత సన్నిహితుడని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. అన్నీ ఆలోచించుకునే ఆయన రాజీనామా చేసి ఉంటారని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Read Also: YSRCP: గెలుపే లక్ష్యం.. సిట్టింగ్‌లను మారుస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆర్కే ఒక బ్రాండ్ అని.. తన పనులతో అలాంటి బ్రాండ్‌ను ఆర్కే సృష్టించుకోగలిగారన్నారు. మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆర్కేకి ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామకృష్ణారెడ్డి సంతృప్తిగా రాజకీయాల నుండి తప్పుకోవాలనుకున్నాడని అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ప్రజలను , పార్టీనీ ఆర్కే వదులుకోడన్నారు. ఆర్కేకి సీటు కావాలనుకుంటే జగన్ ఎక్కడైనా ఇస్తారన్నారు. సీఎంకి ఆర్కేకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. ఆర్కేతో కలిసి మంగళగిరిలో పనిచేసినవారు భావోద్వేగంతో మాట్లాడుతున్నారని చెప్పారు. అవన్నీ పార్టీలో సహజమైన అంశాలు అని.. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.