MP Ayodhya Rami Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికలు వచ్చినట్టు పొత్తులు, చేరికలపై చర్చ సాగుతోంది.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం పార్టీలో వివాదాస్పదంగా కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేపై కేశినేని ప్రశంసలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం మొదలైంది. కొందరు టీడీపీ నేతలు కేశినేనిపై విరుచుకుపడుతున్నారు.. కేశినేని నాని వ్యాఖ్యలతో విజయవాడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ స్థానిక టీడీపీ నేతలు అన్నట్లుగా మారిపోయింది.. అయితే, కేశినేని మాత్రం.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.. తాజాగా నందిగామ ఎమ్మెల్యేలను నాని ప్రశంసించడం అక్కడి టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సమయంలో సొంత పార్టీ ఎంపీలే ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా పొగుడుతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుంటే కేశినేని భవన్‌లో కూర్చుని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని కూడా వ్యాఖ్యానించి కాకరేపారు నాని..
Read Also: YS Viveka Case: అవినాష్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట.. బెయిల్ వచ్చేసింది.. కానీ..!
అయితే, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి..? టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి మనిషి అని ప్రశంసలు కురిపించిన ఆయన.. నాకు మంచి మిత్రుడు కూడా అని గుర్తుచేసుకున్నాడు.. అంతేకాదు.. ఆయన వైసీపీలోకి వస్తే చాలా సంతోషం అని పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయోధ్య రామిరెడ్డి.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రజల కోసం పనిచేస్తాడని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారి కోసం నాని ఎప్పుడూ పనిచేస్తాడన్నారు. వైసీపీలోకి కేశినేని వస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అనేది తల్లి తండ్రి లాంటిది.. ప్రజలకు మంచి చేద్దాం అనుకునే నాయకుల మాదిరి పిల్లలు ఉంటే వారికి అండగా ఉండేదే ప్రభుత్వం అన్నారు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. కాగా, 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి కేశినేని నాని టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించిన విషయం విదితమే.