వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మెదక్‌లోని శంకరంపేటలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మాదిరిగా మహాత్మగాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదన్నారు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు ఈరోజు మహాత్మతో పోల్చుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ అని, లక్షల మంది ఆస్తులు త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ..వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. కేసీఅర్ ఏమో నేనే తెచ్చాను అని చెప్పుకుంటున్నారని, కేసీఅర్ ఇంట్లో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు…? అని ఆమె ప్రశ్నించారు. గడ్డాలు పెంచారు..దొంగ దీక్షలు చేశారు..ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయారంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఒక నిస్వార్థ పరుడని, కేసీఅర్ ఒక స్వార్థ పరుడు ఒక అవినీతి పరుడంటూ ఆమె ఆరోపించారు.