నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పారని, ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రతి మహిళకు సీఎం చంద్రబాబు నాయుడు రూ.36 వేల బాకీ ఉన్నారన్నారు. మహిళలు ఉచిత బస్సు చాలా చిన్న హామీ అని, అది కూడా ఇంతవరకు అమలు చేయలేదని, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తల్లికి వందనం అన్నారు.. రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పిల్లవాడికి కూడా చంద్రబాబు బాకీ పట్టారని జగన్ పేర్కొన్నారు.
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఉద్యోగాలు కల్పించే విషయంలో ఏ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం వచ్చిన జిందాల్‌ను అక్రమ కేసులు పెట్టి తరిమేశారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడే పరిస్థితి వచ్చింది. 18 నుండి 60 ఏళ్ల లోపు ప్రతీ మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు. 2 కోట్ల 7 వేల మంది మహిళలు ఓటర్ లిస్టు ప్రకారం ఉన్నారు, దాదాపు 60 ఏళ్ల లోపు మహిళలు కోటి ఎనభై లక్షలు ఉన్నారు. వాళ్లకు ఏడాదికి 32 వేల కోట్లు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతీ మహిళకు రూ.36 వేలు బాకీ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు.. చాలా చిన్న హామీ. ఏడాదికి రూ.3500 కోట్లు అవుతాయి. ఫస్ట్ ఇయర్ ఎగ్గొట్టారు.. ఈ ఏడాది కూడా ఎగనామం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పెద్ద మనిషి ఇంత చిన్న హామీ అమలు చేయటానికి తన నైజాన్ని చూపిస్తున్నారు’ అని అన్నారు.
‘తల్లికి వందనం అన్నారు, రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలా. రెండు బడ్జెట్లకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలి.. రెండు చోట్ల రెండు రెండు రకాల లెక్కలు రాశారు. ప్రతీ పిల్లవాడి డేటా UDISEలో పొందుపరచి ఉంటుంది. ఆ రిపోర్ట్ ప్రకారం 87,41,885 మంది పిల్లలు 12వ తరగతి లోపు చదుతున్నారు. వాళ్లకు ఏడాది రూ.13 వేల 105 కోట్లు కావాలి. దాంట్లో ఆయన కేటాయించింది రూ.8200 కోట్లు అని ఒకచోట.. మరో చోట రూ.9407గా ఉంది. ప్రతీ పిల్లవాడికి కూడా చంద్రబాబు బాకీ పట్టారు. మరి చిన్నపిల్లలకు కూడా ఆయన బాకీ పడ్డారు. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ కింద 20 వేలు ఇస్తానన్నాడు. గతంలో రైతు భరోసా అందుకున్న వారు 53,58,266 మంది ఉన్నారు. ఆ లెక్కల్లో మొత్తం 10,717 కోట్లు కావాలి. బడ్జెట్లో కేవలం రూ.6300 మాత్రమే కేటాయించారు. ఈ లెక్కలో రైతులకు కూడా చంద్రబాబు బాకీ పడ్డాడు. గతంలో కూడా ఇలాగే రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చి కనీసం వడ్డీలు కూడా ఇవ్వలేదు. ప్రతీసారి అలాగే మోసం చేస్తున్న చంద్రబాబు.. గతంలో ఇలాగే మోసం చేసి ఎలా ఓడిపోయాడో అందరూ చూశారు’ అని జగన్ పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో కోటి యాభై తొమ్మిది లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ఒక్కక్కరికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు. ఒక్క సిలెండర్ మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది కూడా ఎగనామం పెట్టడానికే అడుగులు వేస్తున్నాడు. యాభై ఏళ్లకే పెన్షన్ అన్నాడు.. మరి 50 ఏళ్లకు ఇస్తున్నాడా. అలా ఇవ్వాలంటే మరో ఇరవై లక్షల మంది యాడ్ అవుతారు. వాళ్లకు లెక్క వేసుకుంటే రూ.76,867 వేల కోట్లు కావాలి. ఆడబిడ్డ నిధికి రూ.32,400 కోట్లు.. దీపం పథకానికి రూ.3900 కోట్లు.. అన్నదాత సుఖీభవ రూ.10,717 కోట్లు.. నిరుద్యోగ భృతి రూ.7200 కోట్లు.. ఉచిత బస్సు రూ.3000 కోట్లు.. తల్లికి వందనం రూ.13,050 కోట్లు.. పెన్షన్ వయస్సు తగ్గిస్తే అదనంగా ఏడాదికి రూ.9600 కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయింపులు ఎంత చేశారో అందరూ చూశారు’ అం జగన్ చెప్పుకొచ్చారు.