YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా పలువురిని పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసులో నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం లంచ్ మోషన్ పిటిషన్‌గా దాఖలైన ఈ కేసుపై న్యాయమూర్తి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
Read Also:Singam Style Police: సినిమా స్టైల్లో రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఎస్ఐ ఛేజింగ్..
ఈ విచారణ సందర్భంగా కోర్టు “పిటిషన్‌లపై నిర్ణయం తీసుకునేంత వరకూ నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని” పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1కు వాయిదా వేసింది. పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో జగన్ వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో జగన్‌తో పాటు కారు డ్రైవర్ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను కూడా నిందితులుగా చేర్చారు. అందరూ విడివిడిగా హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా, వీటన్నింటినీ ఇవాళ ఒక్కటిగా విచారణ చేయవలిసి ఉంది.
Read Also:Kannappa Review: కన్నప్ప రివ్యూ
ఇక ఈ కేసు సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం.. సీసీ టీవీ ఫుటేజ్, ఘటన వీడియోలు పర్యవేక్షించిన అనంతరం పోలీసు శాఖ కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. వీడియోల్లో స్పష్టంగా జగన్ వాహనం కింద సింగయ్య పడిన దృశ్యాలు కనిపించాయని ఎస్పీ వివరించారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించగా, న్యాయస్థానంలో విచారణకు దారి తీసింది. అయితే తాజాగా కోర్టు ఈ కేసును జూలై 1కి వాయిదా వేసింది.