Kannappa Review: మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం కన్నప్ప ఈ సినిమాలో మోహన్లాల్, శరత్ కుమార్, ప్రభాస్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ కట్ ఉండడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కన్నప్ప కథ :
స్వర్ణ ముఖి నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతంలో ఐదు ఆటవిక తెగలు నివసిస్తూ ఉంటాయి. అందులో ఒక తెగ నాయకుడు నాధనాధుడు (శరత్ కుమార్) కుమారుడు తిన్నడు(మంచు విష్ణు). చిన్ననప్పుడే తన స్నేహితుడిని మరవలి ఇవ్వడంతో అసలు దేవుడే లేడని నాస్తికుడిగా మారిపోతాడు. అయితే యుక్త వయసు వచ్చాక మరో తెగకు చెందిన నెమలి(ప్రీతి ముకుందన్) మొదటి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా వాయు లింగాన్ని తీసుకువెళ్లడానికి వచ్చిన కాలాముకుడి తమ్ముడిని తిన్నడు చంపేస్తాడు. దీంతో తిన్నాడు సహా 5 గూడాలకు చెందిన ఆటవిక జనాన్ని చంపేందుకు కాలాముఖుడు వేలాదిమంది సైన్యంతో రావడంతో ఆ ఐదు గూడాల నాయకులు కలిసి పోరాడాలని నిర్ణయించుకుంటారు. అయితే ముందు తిన్నడిని తమ నాయకుడిగా ఎన్నుకున్న నాస్తికుడు కావడంతో అతన్ని ఒకానొక సందర్భంలో వెలి వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? నెమలి, తిన్నడు ఒకటయ్యారా? వాయు లింగాన్ని చూడాలన్న నెమలి కోరిక ఏమైంది? నాస్తికుడిగా ఉన్న తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు? ఇందులో రుద్ర( ప్రభాస్), కిరాత(మోహన్ లాల్) పాత్రలేమిటి అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మలయాళ నుంచి మోహన్ లాల్, తమిళం నుంచి శరత్ కుమార్, హిందీ నుంచి అక్షయ్ కుమార్, తెలుగు నుంచి ప్రభాస్ వంటి స్టార్ నటులను తీసుకున్నారు. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నిజానికి మనకి శ్రీకాళహస్తి చరిత్ర గురించి తెలుసు ఆ గుడి ప్రాశస్త్యం తెలుసు కానీ స్థల పురాణం విషయంలో ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే స్థల పురాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా రూపొందించారు. ఓపెనింగ్ తోనే తిన్నడు పాత్ర పరిచయం, తిన్నడు పాత్ర ఎదుగుదల చూపిస్తూ ఐదు గూడాలను ఎస్టాబ్లిష్ చేసిన ప్రయత్నం బాగుంది. అయితే సినిమా అసలు కథంతా సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు తర్వాత సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు కథ ప్రారంభమవుతుంది. సెకండ్ హాఫ్ అంత తిన్నడు భక్త కన్నప్పగా ఎలా రూపాంతరం చెందాడు? అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. నిజానికి ఫస్ట్ ఆఫ్ అంతా ఎస్టాబ్లిష్మెంట్స్ కావడంతో కథ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ కూడా కలుగుతుంది కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలైందో అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ముఖ్యంగా సినిమాలోని చివరి 40 నిమిషాలు ఎప్పుడైతే ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఉంటుందో అప్పటినుంచి సీట్లకు ప్రేక్షకులు అతుక్కుపోయేలా చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి సినిమా ప్రారంభమైనప్పటినుంచి సినిమా మీద ట్రోలింగ్ ఎక్కువగా నడిచింది కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా అదియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకుడు బరువెక్కిన గుండెతో ఒక మంచి సినిమా చూశామని తృప్తితో బయటకు వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక నటీనటులు విషయానికి వస్తే కన్నప్ప పాత్రలో కనిపించిన మంచు విష్ణు అదరగొట్టాడు. అసలు ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించేలా నటించాడు అనడంలో సందేహం లేదు. ప్రభాస్ పాత్ర డిజైన్ చేసిన తీరు వాడుకున్న తీరు బావుంది. ఇక మోహన్ బాబు కనిపించిన ప్రతి సీన్ లో అందరినీ డామినేట్ చేసేలా నటించాడు. మోహన్ బాబు మంచు విష్ణు మధ్య వచ్చిన సీన్స్ అయితే నటనపరంగా ఇద్దరు పోటాపోటీగా నటించారు. మోహన్ లాల్ పాత్ర పరిమితమైనా, కనిపించినంత సేపు ఎంగేజ్ చేశాడు. శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, ముఖేష్ రిషి, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ వంటి వారు తమ పాత్రలతో సినిమాకి ప్రధానమైన అసెట్స్ గా నిలిచారు. మంచు విష్ణు కుమార్తెల సాంగ్ బాగుంది. కుమారుడి డబ్బింగ్ విషయం లో కేర్ తీసుకుని ఉంటే ఇంకా సెట్ అయి ఉండేది. టెక్నికల్ టీం విషయానికొస్తే దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ 100కు వంద మార్కులు వేయించుకునే ప్రయత్నం చేసి దాన్లో చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా కుదిరింది. కొన్నిచోట్ల గూజ్ బంప్స్ ఇచ్చేలా మూమెంట్స్ ఉన్నాయి అంటే దానికి ప్రధాన కారణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. ఇక లొకేషన్స్ అయితే అద్భుతంగా కుదిరాయి. గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్రధానమైన ఆసెట్ అని చెప్పొచ్చు. నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది.
ఫైనల్లీ : కన్నప్ప ఒక మంచి డివోషనల్ మూవీ విత్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్.