YS Jagan: గవర్నమెంట్ స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారని విమర్శించారు. తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారని ఆరోపించారు. మీ ఇళ్లల్లో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, గవర్నమెంటు స్కూలు పిల్లల విషయంలో వివక్ష ఎందుకు? వాళ్లు ఎప్పటికీ కింద స్థాయిలోనే ఉండిపోవాలా? వారి జీవితాలకు మీరు శాపంపెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి? అంటూ ప్రశ్నించారు.
Read Also: Hyderabad: సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ..
దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసమని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా 14 ఏళ్లకాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిందన్నారు. నాడు-నేడు, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ వైపు అడుగులు, టోఫెల్, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్స్, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యాకానుక, రోజుకో మెనూతో గోరుముద్ద… ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చిందన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారని అన్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి కుట్రను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంతజేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలని ప్రశ్నించారు.
Read Also: TG Govt: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. వచ్చే నెలలోనే జారీ..!
గవర్నమెంటు స్కూలు పిల్లలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదని ఆయన అన్నారు. వీళ్లంతా తెలివైన వారు అని తెలిపారు. పైగా ప్రభుత్వ టీచర్లు లక్షలమంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై, చక్కటి శిక్షణకూడా పొందినవారు ఉన్నారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉన్నవారికంటే గొప్పచదువులు చదివినవారు, గొప్పగా చదువులు చెప్పగలిగినవారు ఉన్నారని వెల్లడించారు. అలాంటి వారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి అంటూ పేర్కొన్నారు. పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, సరైన శిక్షణ, పటిష్ట బోధన. టీచర్లకు అందించాల్సింది ప్రేరణ, ప్రోత్సాహం, ఓరియంటేషన్ అని జగన్ చెప్పుకొచ్చారు. గడచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు వారిని నిరుత్సాహపరిచి, ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు.
పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమేనంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యంచేసే తప్పుడు పనులు మానుకోవాలన్నారు. గత సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గవర్నమెంటు స్కూళ్ల పిల్లలు ప్రపంచస్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి అంటూ సూచించారు. లేదంటే మీరు పేదప్రజల వ్యతిరేకులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారని జగన్ ఎక్స్ వేదికగా అన్నారు.
1.@ncbn గారూ.. గవర్నమెంటు స్కూళ్లలో సీబీఎస్‌ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యకు గండికొడుతున్నారు. ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వస్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళ్తున్నారు. మీ ఇళ్లల్లో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024