ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బి.సరోజాదేవి మృతి పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని పేరొన్నారు. ‘సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’అని వైఎస్ జగన్ పేరొన్నారు.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి.. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1955లో కన్నడ సినిమా ‘మహాకవి కాళిదాస’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్‌ల లాంటి దిగ్గజ నటులతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సినీ రంగానికి సరోజాదేవి చేసిన సేవలకు గాను ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.