నిజంగా సీఎం చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజంగా గౌరవం ఉంటే.. రామగిరి మండలం ఏడుకుర్రాకులలో 9వ తరగతి చదువుతున్న బాలికను 14 మంది టీడీపీ వాళ్లు సామూహిక అత్యాచారం చేస్తే, ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు లేదా? అని అడిగారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక కనిపించటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సేపు ‘రెడ్ బుక్.. రెడ్ బుక్’ తప్ప పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన ఏది? అని జగన్ పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు.
‘ఒక రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిందని ఒక పేపర్ కార్యాలయంపై దాడులు చేయటం కరెక్టేనా?. కొమ్మినేని శ్రీనివాసరావుకు నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం అంటే.. సీఎం చంద్రబాబుకు చెంప చెల్లుమని అనిపించటం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే.. చంద్రబాబు ఇందులో దోషి కాదా?. ఇదే సంప్రదాయం కొనసాగిస్తే.. ఇతర చానెల్స్ రిపోర్టర్స్ ఎవరైనా బ్రతుకుతారా?. నిజంగా చంద్రబాబుకు గౌరవం ఉందా?. నిజంగా గౌరవం ఉంటే రామగిరి మండలం ఏడుకుర్రాకులలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను 14 మంది టీడీపీ వాళ్లు సామూహిక అత్యాచారాన్ని చేశారు. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా భయపెట్టింది నిజం కాదా?. తండ్రి లేని ఆ కుటుంబాన్నీ భయపడితే వాళ్లు ఊరు విడిచి వెళ్లింది నిజం కాదా?. ఆ బాలికకు న్యాయం చేసే దమ్ము చంద్రబాబుకు లేదా?. న్యాయం చేయాలనే సిన్సియారిటి ఆయనకు లేదు. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక కనిపించటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమై దొరికింది. కుప్పం నియోజకవర్గంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేశారు. ఈ మనిషా ఆడవారి గౌరవం గురించి మాట్లాడేది. ఎంత సేపు రెడ్ బుక్.. రెడ్ బుక్ తప్ప పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన ఏది?’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నాడు.. సూపర్ సెవెన్ అన్నాడు. ప్రతీ కుటుంబంలో మహిళలు తన సొంత కాళ్ల మీద నిలబడాలి. మహిళలు స్వయంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అని ఆరాట పడ్డాం. మహిళలకు ఎంతో చేసింది ఒక్క వైసీపీ ప్రభుత్వం మాత్రమే. చట్టం చేసి మరీ 50 శాతం పదవులు మహిళలకు ఇచ్చాం. ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని అడుగుతున్నా. మంచి చేసినా మాకా.. ఆ ముసుగులో ఇలాంటి పనులు చేసిన ఆయనకా. మహిళలకు అయినా.. పిల్లను ఇచ్చిన మామకు అయినా వెన్నుపోటు పొడవటంతో ఆయనకు ఆయనే సాటి. ఎన్నికల ముందు జగన్ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు.. ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తా అని చెప్పిన చంద్రబాబు.. చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ మొత్తం చేసేసా అని చెబుతున్నారు. ఎవరైనా సూపర్ సిక్స్ అని అడిగితే నీ నాలుక మందం అని బెదిరిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి 36 వేలు ఇస్తామని చెప్పారు.. ఎంత ఇచ్చారు. ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. 18 ఏళ్లు నిండిన మహిళకు ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు.. 2.10 కోట్ల మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే 1.80 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పీ4 అని కొత్త డ్రామా ఆడుతున్నారు. 1.59 కోట్ల మందికి దీపం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి అంటే 4109 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి టికీ ఏడాది బడ్జెట్ కేటాయింపు 860 కోట్లు. మరి చెప్పిన మాటలు మొత్తం మోసం కాదా అని అడుగుతున్నా’ అని జగన్ ప్రశ్నించారు.
Also Read: YS Jagan: రాష్ట్రాన్ని బీహార్ చేయాలని చూస్తున్నారు.. కావాలనే చెవిరెడ్డిని ఇరికించారు!
‘మహిళలకు ఉచిత బస్సు అన్నిటికన్నా సులభం. రాష్ట్రంలో మహిళలు మొత్తం ఎదురుచూస్తున్నారు. సంవత్సరం అయ్యింది, పండుగల పేర్లు మారుతున్నాయి. అధ్యయనం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పనేముంది.. ఆర్టీసీకి డబ్బులు ఇస్తే చాలు. ఎవరికి కావలసిన వాళ్ళు అక్కడకు వెళ్ళి చూసి వస్తారు. 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు.. రాష్ట్రంలో 20 లక్షల మంది అర్హులు ఉన్నారు. మొదటి సంవత్సరం ఎవరికీ ఇవ్వలేదు.. రెండవ ఏడాది వచ్చింది. ఇచ్చే పెన్షన్లు కూడా తగ్గించేశారు. ఎన్నికల తర్వాత ఐదు లక్షల పెన్షన్లు తీసేసారు. ఒక్కటి కొత్తది ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్లు తీసేసారు. ప్రధాని పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేలు ఇస్తా అన్నాడు. గత ఏడాది ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు.. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో 10,716 కోట్లు ఇవ్వాల్సింది ఎగగొట్టారు. తల్లికి వందనం పేరిట తల్లులకు వంచన చేస్తున్నారు. ప్రతీ విద్యార్ధికి ఎలాంటి షరతులు లేకుండా ఒక్కొక్కరికీ 15 వేలు ఇస్తా అన్నాడు. ఆంక్షలు లేవు.. కటింగ్ లు లేవని చెప్పారు. వీళ్ళందరికి ఇవ్వాలంటే 13 వేల కోట్లు కావాలి.. ఇస్తానంటున్నది 8 వేల కోట్లు. దాదాపుగా 30 లక్షల మందికి కోత పడుతుంది’ అని జగన్ చెప్పారు.