Honey Trap: సోషల్ మీడియా వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం పేరిట వల వేస్తున్నారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో చాటింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. అనంతరం తాము డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ బాధితుల నుంచి దొరికినకాడికి దోచేస్తున్నారు. ఆకర్షణీయమైన ఫొటోలతో ముగ్గులోకి దింపి.. ఒక్క బలహీన క్షణంలో చేసిన పొరపాటును బలమైన ఆయుధంలా మార్చుకుని అందికాడికి దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Read Also: Pakistan : పీఓకేలో అదుపు తప్పిన పరిస్థితి.. ఒక పోలీసు మృతి, 90 మందికి పైగా గాయాలు
తియ్యనైన గొంతుతో మాట్లాడి యువకుడి మనస్సును కట్టిపడేసి.. వలపు వల వేసి.. కలుద్దామని పిలిపించి ఓ యువతి నిలువు దోపిడీకి పాల్పడిన ఘటన ఫిలింనగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. డేటింగ్ యాప్‌లో ఓ యువకుడికి ఓ యువతి పరిచయమైంది. అతనితో చాటింగ్ చేసింది. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఫోన్ చేయగానే హాయ్ అంటూ తీయగా మాట్లాడింది. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో తన జీవితంలోకి అందాల రాశి వచ్చిందని సంబరపడ్డాడు. కలుద్దామనగానే ఆ యువకుడు ముస్తాబై.. రెక్కలు కట్టుకుని ఆ యువతి రమ్మన్న చోటుకు వెళ్లాక అతని మైండ్ బ్లాక్ అయింది. అక్కడ ఓ ముఠా తన కోసం ఎదురుచూస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ కిలాడీ లేడీని ఎరగా వేసి యువకుడిని బెదిరించారు. పోలీసులకు, మీడియాకు పట్టిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. కారులో తీసుకుని వెళ్లి పెట్రోల్ బంకులో స్కాన్ చేయించి సదరు ముఠా డబ్బులు దోచుకుంది. డేటింగ్ యాప్ ద్వారా కేటుగాళ్లు యువకుడికి గాలం వేశారు. ఈ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో ipc 382, 120(బీ) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.