Kurnool MP Candidate: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుకను ఖరారు చేసింది. శనివారం ఈ రెండు స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా.. విముఖత చూపిన కారణంగానే గుమ్మనూరు జయరాంకు వైసీపీ మంగళం పాడేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముందుగా గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయున ఎంపీ సీటుపై విముఖత చూపారు. గతకొన్ని రోజులుగా గుమ్మనూరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పలువురి ఫోన్లకు స్పందించ పోగా.. రాకపోకలనూ గోప్యంగా ఉంచారు. వైసీపీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా.. ఆయన అందుబాటులోకి రాలేదు. చివరికి రీజినల్ కో ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి చర్చలు జరిపినా జయరాం అంగీకరించలేదు. దాంతో జయరాంకు గుడ్ బై చెప్పాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
Also Read: YS Jagan: రాజ్యాంగ కర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం: సీఎం జగన్
తాజాగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే.. తన కుమారుడు ఈశ్వర్‌కి ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని గుమ్మనూరు జయరాం కండిషన్ పెట్టరట. ఇది సాధ్యం కాదని చెప్పిన వైసీపీ అధిష్టానం.. ఆయనకు గుడ్ బై చెబుతోందట. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలో గుమ్మనూరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.