ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు పరామర్శించారు.
Also Read: CM Chandrababu: ఏపీలో జీరో క్రైమ్ ఉండాలి.. నేరాలు చేయాలంటే భయపడాలి: సీఎం
ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘అఘాయిత్యాల కారణంగా రాష్ట్రంలో ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశారు. ఈ నాలుగు మాసాల్లోఇలాంటి 74 సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా?. హోంమంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్, అలాంటి పాప చనిపోవడం బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే.. పది నిమిషాల్లో స్పాట్‌కి వెళ్ళేవారు. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోంది’ అని అన్నారు.