ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ జిల్లా పోలీసులు నోటీసులు పంపడంతో ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీసీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాల ముందు నిరసన చేపట్టాయి. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు వైసీపీతో సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు. సీఎం జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని… అందుకే రాష్ట్రంపైకి పందులను, కుక్కలను వదిలాడని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. బురదలో పొర్లే పందులతో, కుక్కలతో, నక్కలతో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రెస్‌మీట్లలో ప్రజాసమస్యలపై, ప్రభుత్వ పరమైన విధానాలపై మాట్లాడితే తమకేమీ ఇబ్బందిలేదన్నారు. మీరు ఎంత తిట్టినా సీఎం జగన్ స్థాయిని అంగుళం కూడా తగ్గించలేరని పేర్కొన్నారు. తాము సంస్కారవంతమైన నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరు బతికిపోయారని వ్యాఖ్యానించారు.