కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా ఏపీ ప్రభుత్వం తయారైందని మాజీమంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. మాట తప్పి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఈ ఆరు నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిమాండుకు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని మేరుగు నాగార్జున పేర్కొన్నారు.
వైసీపీ లీడర్ మేరుగు నాగార్జున అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ‘ఈప్రభుత్వం కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా తయారైంది. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు.. మాట తప్పి నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఆరు నెలల్లో రూ.15,485 కోట్ల మేరా ప్రజలపై విద్యుత్ భారం పడింది. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేశాం. రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా చేయలేక అనధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. గతంలో వేసవిలో బొగ్గు సరఫరా లేకున్నా విద్యుత్ కోతలు లేకుండా చేశాం’ అని గుర్తుచేశారు.
‘గతంలో 2019కి ముంది టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.20 వేల కోట్ల సర్దుబాటు చార్జీల భారాన్ని మా ప్రభుత్వమే మోసింది. వైసీపీ ప్రభుత్వ హాయంలో వైఎస్ జగన్ పాలన తీరును ప్రజలు గమనించాలి. గతంలో విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా జరిగిన బషీర్ బాగ్ ఘటనలు అందరికీ గుర్తున్నాయి. విద్యుత్ చార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుంది. గత ప్రభుత్వ హయంలో ప్రజలకు అందిన మంచి పథకాలు ఇవాళ నిర్వీర్యం అయ్యాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి’ అని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.