Kalimili Ramprasad Reddy: నేనే రాజు.. నేనే మంత్రి.. 2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే అని చెప్పుకుంటే కుదరదు అంటూ వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకూర్‌రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. నేదురుమల్లి శైలితో పార్టీలో సమన్వయం లోపించిందని విమర్శించారు. మున్సిపాలిటీలో, మండల్లాల్లో, గ్రామాల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు ప్రాధాన్యత లేదు.. పార్టీలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేదు.. పార్టీ నిర్ణయాల ప్రకారం 10 నెలల క్రితం నేదురుమల్లిని స్వాగతించాం. కానీ, ప్రస్తుతం నేదురుమల్లి నియోజకవర్గంలో తాను చెప్పిందే జరగాలంటూ నియంతలా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
Read Also: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ నాలుగో సెంచరీ చేసేనా?
ఇటీవల వెంకటగిరిలో జరిగిన సీఎం వైఎస్ జగన్ పర్యటనలో వారికి ప్రాధాన్యత లేదు. నియోజకవర్గంలో పరిస్థితిని పార్టీ అధిష్టానానికి తెలియజేశాం అని తెలిపారు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.. పార్టీలో నేదురుమల్లి రాంకూర్‌రెడ్డి పరిస్థితి ఇలానే ఉంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు. భయపెట్టడం, బెదిరించడం మానుకోవాలని సూచించారు. ఇక, నేనే రాజు… నేనే మంత్రి అంటే కుదరదు. 2024 వైసీపీ టికెట్ నాదే అని చెప్పుకుంటే కుదరదు. టికెట్ ఎవరికనేది ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి.