టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2025-26 సీజన్‌లో గోవాకు ఆడాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘానికి (ఎంసీఏ) మంగళవారం యశస్వి లేఖ రాశాడు. యశస్వి నిర్ణయానికి ఎంసీఏ ఆమోదం తెలుపుతూ ఎన్‌ఓసీ కూడా మంజూరు చేసింది. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్ కూడా ముంబై టీంను వీడి గోవా జట్టులో చేరిన విషయం తెలిసిందే.
Also Read: RCB vs GT: విజృంభించిన సిరాజ్, దంచేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం!
ఎంసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ… ‘ఇది నిజంగా ఆశ్చర్యకర పరిణామం. ఈ నిర్ణయం వెనుక యశస్వి జైస్వాల్ ఎంతగానో ఆలోచించే ఉంటాడు. తనను విడుదల చేయాలన్న యశస్వి విజ్ఞప్తికి ఎంసీఏ నుంచి ఆమోదం తెలిపాం’ అని చెప్పారు. ‘యశస్వి జైస్వాల్‌ను మేం స్వాగతిస్తున్నాం. వచ్చే సీజన్ నుంచి యశస్వి గోవా తరఫున ఆడతాడు. టీమిండియా మ్యాచులు లేనప్పుడు గోవాకు యశస్వి సారథ్యం వహిస్తాడు’ అని గోవా క్రికెట్ సంఘం కార్యదర్శి శంబా దేశాయ్ తెలిపారు. భారత క్రికెటర్లు దేశవాళీలో ఆడటాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. చివరగా జమ్ముకశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తరఫున యశస్వి 4, 26 పరుగులు చేశాడు.