Vijay Diwas: డిసెంబర్ 16, 1971న దాయాది దేశం పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లింది. తమను రక్షించాలని ప్రాధేయపడింది. పాకిస్తాన్ నుంచి కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఈ యుద్ధం పాకిస్తాన్ భూభాగాన్ని సగం చేసింది. ఏకంగా 90,000 మంది పాకిస్తాన్ సైనికులతో పాటు పాక్ తూర్పు కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత్ ముందు లొంగిపోతూ, లొంగుబాటు పత్రంపై సంతకం చేశాడు. భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, బంగ్లాదేశ్ ముక్తిబాహిని కమాండర్ల ముందు నియాజీ లొంగిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సైనిక లొంగుబాటు. ఈ విజయానికి గుర్తుగా ప్రతీ ఏడాది భారత్ డిసెంబర్ 16ను ‘‘విజయ్ దివాస్’’గా జరుపుకుంటుంది.
ఓ వైపు ఓడిపోతున్నా.. సె*క్స్, మందు మత్తులో పాక్ జనరల్:
ఓ వైపు పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోతుంది. దేశంలోని సగ భాగం( తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్) కోల్పోతోంది. అయినా కూడా అప్పటి పాక్ సైనిక చీఫ్, సైనిక నియంత యాహ్యా ఖాన్ మాత్రం మందు, విందు, పొందుతో చాలా ఎంజాయ్ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రావల్పిండిలో తన ‘‘జనరల్ రాణి’’గా పిలువబడే మహిళతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఓటమిపై పాక్ ప్రభుత్వం సొంత దర్యాప్తు చేసింది. ఓటమి కన్నా కూడా పాక్ సైనిక అధికారుల నైతిక పతనం, సైనికాధికారుల లైంగిక అశ్లీల జీవనశైలి కారణమని, ఇది వారి వృత్తి నైపుణ్యాన్ని, నాయకత్వాన్ని పూర్తిగా దెబ్బతీసినట్లు చెప్పింది. యాహ్యా ఖాన్ తర్వాత, పాక్ కొత్త నేతగా, ప్రధానిగా ఎన్నికైన జుల్ఫికర్ అలీ భుట్టో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి హమూదుర్ రెహమాన్‌ను చీఫ్‌గా నియమించాడు. పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్‌ను ఎందుకు కోల్పోయింది, దీనికి ఎవరు బాధ్యులు, చర్యల్ని సిఫారసు చేయడం ఈ కమిషన్ లక్ష్యం.
నివేదికలో సంచలన విషయాలు:
హమూదుర్ రెహమాన్ కమిషన్ (HRC) 1972న తన పనిని ప్రారంభించి, 1974లో తన నివేదికను సమర్పించారు. పాకిస్తాన్ కేవలం సైనిక అసమర్థత వల్ల మాత్రమే యుద్ధంలో ఓడిపోలేదని, దాని సైనిక జనరల్స్ దురాచారాలు, అవినీతి, విచ్చలవిడితనం కారణంగా ఓడిపోయిందని, సైనికులు సైనికులుగా ఉండటం మానేయడం వల్లే ఓడిపోయినట్లు చెప్పింది. జనరల్స్ దేశ రక్షణను వదిలేసి మద్యం, మగువలతో శృంగారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నివేదిక చెప్పింది.
తాగుబోతు జనరల్ యాహ్యా ఖాన్:
జనరల్ ఆఘా ముహమ్మద్ యాహ్యా ఖాన్ 1969 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని, పాక్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పాక్ ప్రభుత్వాన్ని సరైన దారిలో పెట్టి, తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువస్తానని మాట ఇచ్చాడు. కానీ అతను తన సైనిక విధుల్ని మరిచిపోయి అమ్మాయిలోతో చిందులు, మందు పార్టీలతో మునిగిపోయాడు. 1971లో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)లో ముజిబుర్ రెహమాన్ పార్టీ గెలిచిన తర్వాత, సైనిక అణిచివేతకు పాల్పడ్డాడు. దీంతో ఆ తర్వాత అంతర్యుద్ధం మొదలైంది. దీనంతటికి యాహ్యా ఖాన్ కారణమని చెబుతుంటారు.
యుద్ధంలో ఓడిపోతున్నామని పాక్ సైనికులు ఢాకా నుంచి సమాచారం పంపించినప్పటికీ, ఇది సైనికాధికారులకు చేరలేదు. వీరంతా మందు పార్టీల్లో ఉండేవారు. ఈ నిర్లక్ష్యం మొత్తం సైన్యంలో ఉంది. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు క్రమశిక్షణ లోపించింది.
పడక గది నుంచే పాలన:
యాహ్యా ఖాన్ సుఖాలకు మరిగి పాక్ సైన్యాన్ని పట్టించుకోలేని ఇప్పటికీ పాక్ ప్రజలు భావిస్తుంటారు. యాఖ్యా ఖాన్‌కు అత్యంత సన్నిహితురాలైన అక్లీమ్ అక్తర్‌ను దేశం మొత్తం ‘‘జనరల్ రాణి’’గా పిలిచేది. ఈమెకు ఎలాంటి అధికారం లేకున్నా, నియామకాలు, పదోన్నతులు, కాంట్రాక్టులు అన్నీ ఈమె ద్వారానే జరిగేవి. పాక్ చరిత్రలో అత్యంత అధికార దుర్వినియోగానికి ఈమె సాక్ష్యంగా నిలిచింది.
ఈమెతో పాటు పాక్ ప్రసిద్ధి సింగర్ నూర్ జహాన్ యుద్ధ సమయంలో రేడియోలో పాటలు పాడి దేశభక్తిని ప్రేరేపించేంది. ఈమెకు మెలోడీ క్వీన్ అనే పేరుంది. అయితే, యాహ్యాఖాన్‌తో ఈమె కూడా సన్నిహితంగా ఉండేదని, యుద్ధ సమయంలో రాత్రి వేళల్లో యాహ్యాఖాన్ నివాసంలో సన్నిహితంగా గడిపేదని పలువురు చెప్పేవారు.
నియాజీ కూడా ఇంతే..
భారత్ ముందు లొంగిపోయిన నియాజీ కూడా మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవాడని తెలిసింది. పాన్ అక్రమ రవాణాలో ఇతడి ప్రమేయం ఉంది. లాహోర్‌లోని ఒక వేశ్యాగృహ నిర్వాహకురాలైన సయీదా బుఖారీతో సంబంధం, సైన్యంలో క్రమశిక్షణ లేకపోవడం వంటివి ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. కమాండర్ అత్యాచారాలకు పాల్పడితే, సైనికులు కూడా బంగ్లాదేశ్‌లో అదే పనిచేశారు.
ఈ ఓటమి తర్వాత యాహ్యా ఖాన్ తన అధ్యక్ష పదవిని కోల్పోయాడు. ప్రజల ఆగ్రహం మధ్య అధికారాన్ని భుట్టోకు అప్పగించాడు. అతడిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. చివరకు 1980లో రావల్పిండిలో మరణించాడు. ఇక నియాజీ ఓటమికి బాధ్యుడిగా నిందలు ఎదుర్కొన్నాడు. ఆయనను సైన్యం నుంచి తప్పించారు. ఓటమికి తనను బలిపశువు చేశారని ఆరోపించాడు. చివరకు 2004లో మరణించాడు.