YSRTP: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీకి చేరుకున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి వచ్చిన అనంతరం విజయవాడ నుంచి ఆమె ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వైఎస్ షర్మిల.. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవనున్నారు. హస్తం పార్టీ అగ్రనేతల సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో చోటు కల్పించడం లేదా ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే ఛాన్స్ ఉందన్నట్లు తెలుస్తుంది.
Read Also: Divya Pahuja: గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్టు ఇచ్చింది. తమ మద్దతు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనం చేయాలని షర్మిల నిర్ణయించుకుంది. ఇక, నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి కుటుంబంతో సహా షర్మిల ఆమె భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కోబోయే కోడలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి దాదాపు అరగంట సమావేశం అయ్యారు. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను షర్మిల అందజేశారు.