Brij Bhushan: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ పోగాట్, సాక్షి మాలిక్ తదితరులు కూడా ఆందోళనలో పాల్గొనడంతో కేంద్రం దిగివచ్చింది. వెంటనే సమస్యకు ముగింపు పలికేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే మరో రెజ్లర్, భాజపా నేత బబితా ఫోగాట్ ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా గురువారం ధర్నా ప్రాంతానికి వచ్చి రెజ్లర్లతో మాట్లాడారు. అథ్లెట్లకు ప్రభుత్వం మద్దతు ఉంటుందని సమస్యను ఈరోజే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Read Also: Swiggy: లే ఆఫ్ ట్రెండ్‌లోకి స్విగ్గీ..కారణమిదే!
బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర క్రీడల శాఖ స్పందించింది. 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్‌ఐని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే జాతీయ క్రీడా నియమావళి ప్రకారం సమాఖ్యపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. కాగా, సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ నేడు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు ఫోన్ చేశారు. రెజ్లర్లు చేస్తోన్న ఆరోపణలపై ఆయన కేంద్రమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అత్యవసర పరిస్థితుల నడుమ వచ్చే ఆదివారం అయోధ్యలో జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మీటింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూషణ్ 2011 నుంచి పదవిలో ఉంటున్నారు. 2019 ఫిబ్రవరిలో మూడోసారి డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Read Also: Nitish Kumar: “నాకు ఒకే కల మిగిలి ఉంది”.. కేసీఆర్ సభపై నితీష్ కుమార్..