Women’s Reservation Bill cleared in key Cabinet: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదించింది. ఇంకా నాలుగు రోజుల పాటు నూతన పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
Also Read: Union Cabinet: కేబినెట్ నిర్ణయాలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. అంతా గోప్యమే!
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్‌ను నిర్ధారించే బిల్లుకు ఈ సాయంత్రం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పలు వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం దానిని ఇంకా ప్రకటించలేదు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం సాగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ఓబీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే.
కేబినెట్ భేటీ కంటే ముందు పలువురు మంత్రులు కీలక సమావేశాలు జరిపారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.
పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు, ఇండియాకు భారత్‌గా పేరు మార్చే తీర్మానం అనే రెండు అంశాలు చర్చకు రానున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రేపు రెండు రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 22 వరకు కొనసాగనున్నాయి. మంగళవారం పార్లమెంట్ కార్యకలాపాలు నూతన భవనంలో జరగనున్నాయి.