Withdrawal of Rs 2,000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.. సెప్టెంబర్ 30 నాటికి రూ. 2,000 బ్యాంకు నోట్లు చాలా వరకు తిరిగి ఖజానాకు వస్తాయని మేం భావిస్తున్నాం అని తెలిపారు.. రూ. 2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు సూచించామని తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కసరత్తు పూర్తి చేయడానికి సెంట్రల్ బ్యాంక్ 4 నెలల సమయం ఇచ్చిందని గవర్నర్ చెప్పారు.
మేం సెప్టెంబరు వరకు గడువు ఇచ్చాం.. కాబట్టి ఇబ్బంది ఉండబోదన్నారు.. ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలి. మేం దానిని తెరిచి ఉంచలేం. అన్నారు.. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, సీనియర్ సిటిజన్లు మరియు విదేశాలలో చదువుతున్న విద్యార్థులతో సహా పౌరులందరి సమస్యలు మరియు ఇబ్బందుల విషయంలో ఆర్బీఐ సున్నితంగా ఉంటుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్.. క్లీన్ నోట్ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పుకొచ్చారు.. అందులో భాగంగానే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు.
ఇక, రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో కూడా వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న ఆయన.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.. అందుకే రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేశామని.. ఇప్పుడు ఉపసంహరిస్తున్నామని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. మరోవైపు.. 2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం వల్ల నగదు సరఫరా లేదా ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన నోట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్‌బీఐ పథకానికి మించిన లక్ష్యం లేదని ఆయన అన్నారు. బ్యాంకుల్లో రూ. 2,000 నోట్లను తిరిగి ఇవ్వడానికి లేదా డిపాజిట్ చేయడానికి మార్గాలపై మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ఒక రోజులో అనేకసార్లు మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు అని స్పష్టం చేశారు.
ఇది తటస్థంగా ఉంది మరియు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపదు. క్లీన్ నోట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేం కోరుకుంటున్నాము మరియు ఆర్బీఐ చేసిన ఈ కసరత్తులో వేరే లక్ష్యం లేదు అని అజయ్ సేథ్ పేర్కొన్న విషయం విదితమే.. ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం మాట్లాడుతూ రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవడం కరెన్సీ నిర్వహణలో భాగమేనని స్పష్టం చేశారు..