Rohit Sharma Prediction in IPL 2024: క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ 2024 సిద్ధమైంది. మార్చి 22 నుంచి 17వ సీజన్ ప్రారంభం కానుంది. గత 2-3 సీజన్‌లుగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అందరి దృష్టి ఉండగా.. ఈసారి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనుండటమే ఇందుకు కారణం. కెప్టెన్సీ బాధ్యత లేని రోహిత్.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు? అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ 2024 మినీ వేలం సమయంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కి హార్దిక్ పాండ్యా వచ్చిన విషయం తెలిసిందే. ఆపై ముంబై జట్టు పగ్గాలు రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు వెళ్లాయి. టోర్నీలో ముంబైని తిరుగులేని జట్టుగా నిలబెట్టిన రోహిత్‌ను ఇలా తప్పించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ముంబై భవిష్యత్ కోసమే హార్దిక్‌కు జట్టు పగ్గాలు ఇచ్చామని ప్రాంచైజీ స్పష్టం చేసింది. దాంతో ఫాన్స్ కూడా కాస్త శాంతించారు. ఏదేమైనా ప్రస్తుత సీజన్‌లో హార్దిక్ కెప్టెన్సీలో హిట్‌మ్యాన్ ఆడాలి.
Also Read: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
గత రెండు సీజన్‌లలో రోహిత్ శర్మ బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ 2023లో 16 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 332 పరుగులే చేశాడు. అంతకుముందు సీజన్‌లో 268 పరుగులే చేశాడు. కెప్టెన్సీ బాధ్యతలు బ్యాటింగ్‌పై ప్రభావం పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు లేవు. దీంతో బ్యాటింగ్‌లో ఎలాంటి ఒత్తిడి ఉండదు కాబట్టి హిట్‌మ్యాన్ చెలరేగే అవకాశం ఉంది. గత ఏడాది కాలంగా రోహిత్ ఫామ్ మీదున్నాడు. సెంచరీలతో చెలరేగుతున్నాడు. అదే ఫామ్ ఐపీఎల్ 2024లో కూడా కొనసాగించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. జట్టుకు టైటిల్ అందించడంలో రోహిత్ కీలకపాత్ర పోషించి.. తన సత్తా ఏంటో చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ గతంలో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు వదిలేశాక రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.