Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భవిష్యత్తు, ఫామ్‌పై వస్తున్న విమర్శలకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)లో గట్టి సమాధానం ఇచ్చాడు. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు స్వయంగా తెరదించుతూ, తాను ఇప్పట్లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.. మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. “భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?” అనే ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ స్పందిస్తూ.. తాను ఇప్పుడే భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు లేవని, వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే ఆలోచన చేయడం లేదంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.
Read Also: Yuzvendra Chahal: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి చూడండి.. చాహల్ సంచలన పోస్టు
అయితే, రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. కెరీర్ ఓ దశకు వచ్చినప్పుడు రిటైర్మెంట్ గురించి చర్చించటం సహజమేనని, కానీ.. రోహిత్ ఇప్పటికీ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తున్నట్లు అతను పేర్కొన్నారు. అతడు రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదని రికీ పాంటింగ్ పేర్కొన్నారు. రోహిత్ గత వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయాడు కాబట్టి, అందుకే మరో ప్రపంచకప్ ఆడి జట్టుకు టైటిల్ అందించాలని అతడు కోరుకుంటున్నాడని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఐసీసీ వైట్‌బాల్ ఫార్మాట్‌లో అన్ని ట్రోఫీలను గెలుచుకోవాలనే లక్ష్యంతో రోహిత్ మరో వన్డే ప్రపంచకప్ ఆడటానికి అర్హుడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్ ప్రదర్శనను గమనించిన వారెవరైనా అతడి కెరీర్ ముగిసిందని చెప్పగలరా? అంటూ పాంటింగ్ ప్రశ్నించాడు. మొత్తానికి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా వన్డేల్లో కొనసాగుతానని స్పష్టత ఇచ్చాడు. ఇక 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడు ఆడతాడా? అనేది క్రికెట్ ప్రేమికులకు ఆసక్తికరమైన అంశంగా మారింది.