Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్న రాష్ట్రాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీకి అప్పగించింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు మూడింటితో ఓడిపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఓటమిపై గురువారం సీడబ్ల్యూసీ మీటింగ్‌లో చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు స్థానిక ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Read Also: Varun Gandhi: “నిజమైన నాయకుడు అలా చేయడు”.. నానమ్మ ఇందిరాగాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు..
ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగుసార్లు బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. అయితే, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ చిన్న పార్టీలతో సర్దుబాటు చేసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్లు ఎందుకు సిద్ధంగా లేవని ప్రశ్నించారు. చిన్న పార్టీలకు పోలైన ఓట్లను బీజేపీ పొందడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ(ఎస్పీ)తో సీట్ల సర్దుబాటుపై విభేదాలను గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కాంగ్రెస్ చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటును అంగీకరించి ఉండాల్సిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మూడు రాష్ట్రాల్లో సరిగ్గా ప్రచారం చేయలేదని రాహుల్ గాంధీ భావించారు. పలువురు నేతలు మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత బలాన్ని ఎత్తి చూపేందుకు ప్రయత్నించారు. అయితే 2018లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.