Why AP Needs YS Jagan: వరుస కార్యక్రమాలతో దూసుకుపోతోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రేపటి నుంచి మరో క్యాంపైన్ కు శ్రీకారం చుట్టనుంది. గురువారం నుంచి వైసీపీ.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో సచివాలయ పరిధిలో ఈ క్యాంపైన్ కొనసాగనుంది. గత నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాలను వివరించడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది, పార్టీకి సంబంధించిన కేడర్ పాల్గొంటారు. ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ యా సచివాలయాలకు జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. అదే సమయంలోవైసీపీకి సంబంధించిన గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, పార్టీ మండల స్థాయి నేతలు గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తారు.
2014లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని విషయాలను ప్రజలకు వివరిస్తారు. ఏడాదికి 12 గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ భృతి, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వంటి వైఫల్యాలు వివరిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు అంశాలు ఉంటాయి. మొదటి రోజు సచివాలయాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఆ సచివాలయ పరిధిలో ఎంత మందికి ఏ ఏ పథకాల కింద ప్రయోజనం కలిగింది, ఎంత మేరకు కలిగింది, అదే విధంగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంత వెచ్చించింది వంటి విషయాలతో కూడిన బోర్డులను ప్రదర్శిస్తారు. మరోవైపు పార్టీ వైపు నుంచి మొదటి రోజు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారు. అనంతరం స్థానికంగా ప్రభావిత వ్యక్తులు, వర్గాలు, బృందాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రాత్రికి పార్టీ క్యాడర అదే సచివాలయ పరిధిలో విడిది చేసేటట్లు కార్యక్రమ రూపకల్పన చేశారు. రెండో రోజు సచివాలయ పరిధిలోని ప్రతి గడపను సందర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న తలసరి ఆదాయం, అభివృద్ధి రేటు వంటి ప్యారామీటర్స్, ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులను వివరిస్తారు.
చేసిన పనుల్ని గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచబోతోంది వైసీపీ. డిసెంబర్ 19 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ అనే క్యాంపైన్ కొనసాగనుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిందని కొందరు ఆరోపిస్తున్నారు.. మరికొందరు శ్రీ లంకగా మారుతుందని అన్నారు.. వాస్తవంగా జీఎస్‌డీపీలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహిస్తాం అన్నారు.. 4 లక్షల 90 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం.. వ్యవసాయ రంగంలో చంద్రబాబు హయాంలో ప్రతికూల వృద్ధి రేటు లో ఉండేది.. ఇప్పుడు గణనీయంగా ప్రగతి సాధించాం అన్నారు.. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు.. జగన్ అభివృద్ధి చేశారు.. వైద్య రంగంలో కూడా ఎన్నో సదుపాయాలు కల్పించారు.. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేశారు.. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 5 కోట్ల మందికి వైద్య సేవలు అందించాం.. నాలుగేళ్లలో కొత్తగా నాలుగు ఓడరేవులు.ఎం 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి.. మౌలిక సదుపాయాల రంగంలో రాష్ట్రం గణనీయ ప్రగతిని సాధించింది అని గుర్తు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.