Kumari Aunty Background: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం కుమారి ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఫుడ్ వీ లాలింగ్ బాగా పెరిగిపోయింది. అంటే కొంతమంది ఫుడ్ మీద కంటెంట్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేది తెలుసుకుని అక్కడికి వెళ్లి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలా కొంతమంది ద్వారా గుడివాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ మధ్యాహ్నం భోజనం అమ్ముకునే ఒక మహిళ ఫేమస్ అయింది.
ఎవరీ కుమారి ఆంటీ?
ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీగా సోషల్ మీడియా ఆమెకు నామకరణం చేసి వైరల్ చేసింది. నిజానికి ఆమెకు సంబంధించిన వీడియోలు గత రెండు మూడేళ్ల నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్ ఫామ్స్ లో తిరుగుతూనే ఉన్నాయి. అయితే మీ బిల్ ₹1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా తిన్నారు కదా అని పేర్కొన్న వీడియో వైరల్ కాగా దానిని ట్రోలింగ్ చేస్తూ వీడియో చేయడంతో ఆమె మళ్లీ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. ఈ సమయంలోనే ఊరు పేరు భైరవకోన సినిమా యూనిట్ ఆమె ట్రెండింగ్ లో ఉందని తెలుసుకుని ఆమె దగ్గరికి వెళ్లి ఒక వీడియో రిలీజ్ చేయాలని భావించి అక్కడికి వెళ్ళింది. అలా సందీప్ కిషన్ సహా హీరోయిన్ కూడా అక్కడికి వెళ్లడంతో మీడియా దృష్టి కూడా ఆమె మీద పడింది. ఈ నేపద్యంలో యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ సైతం ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించాయి.
ఆమె చేసే వంటలు అంత బాగుంటాయా?
ఈ నేపథ్యంలో మీడియాలో ఇంత పాపులారిటీ రావడంతో అసలు అంత విషయం ఉందా? ఆమె చేసే వంటలు అంత బాగుంటాయా? అని చూడటానికి కొందరు వెళితే నిజంగానే ఆమెకు లక్షల సంపాదన వచ్చి పడుతుందా అంతలా సంపాదించడానికి అక్కడ ఏమి అవకాశం ఉంది? అని చూడడానికి మరికొందరు. అక్కడికి వెళ్లి వీడియోలు తీసే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మరికొందరు. ఇలా అందరూ ఆమె వ్యాపారం చేసుకునే ఏరియా వద్దకు క్యూ కట్టారు. ఈ దెబ్బతో ట్రాఫిక్ జామ్ అవడం మొదలైంది. కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే రూట్ లో బ్రిడ్జి దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకుంటే ఆమె బిజినెస్ ఏరియా వస్తుంది. అందరూ బండ్లు, కార్లు రోడ్ల మీద పార్క్ చేసి ఆమె దగ్గరికి వెళ్లి తినడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది.
పొలిటికల్ ఎంట్రీ
ట్రాఫిక్ పోలీసులు కల్పించుకుని ఆమె ఫుడ్ తీసుకొస్తున్న ట్రక్కును ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల వద్ద ట్రక్కు ఉండడంతో ఆమె బిజినెస్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో పొలిటికల్ ఎంట్రీ జరిగింది. ఆమె తనకు జగన్ ఇల్లు ఇచ్చారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. దీంతో పోలీసులు అలా చేయడానికి కారణం జనసేన, టిడిపి అని వైసీపీ ఆరోపిస్తే ఇందులో కూడా రాజకీయం చేస్తారా అని ఆ పార్టీలు కౌంటర్ ఇచ్చాయి. అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆమె బిజినెస్ ఆమెను చేసుకోనివ్వాలని, ఇలాంటి చిరు వ్యాపారులకు మనమే అండగా ఉండాలని చెబుతూ తాను వీలున్నప్పుడు వెళ్లి ఆమె దగ్గర భోజనం చేసి వస్తానని కూడా పేర్కొన్నారు.
సింగర్ ఇంట్లో వంట మనిషిగా మొదలు పెట్టి
ఇక ఈ దెబ్బతో ఆమె ఎవరు ఏమిటి అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి భర్తతో కలిసి మెరుగైన జీవితం కోసం హైదరాబాద్ వచ్చింది. దాదాపు 13 ఏళ్ల నుంచి ఇదే బిజినెస్ లో కొనసాగుతోంది. ఉదయాన్నే లేచి వంటలు చేసుకుని వెజ్ నాన్ వెజ్ అన్నీ సిద్ధం చేసుకుని ఆమె ఈ ఫుడ్ బిజినెస్ మొదలు పెడుతుంది. అయితే ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు ఆమె సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా పనిచేసేదట. పెరుగుతున్న పిల్లలతో హైదరాబాదులో జీవనం కాస్ట్లీ అనిపించడంతో ఈ బిజినెస్ లోకి దిగినట్లు ఆమె వెల్లడించింది. ఇక లాక్ డౌన్ సమయంలో గుడివాడ వెళ్లి అక్కడ చిక్కుకుపోవడంతో ఏం చేయాలో తెలియక తమకు ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు పండించి అమ్మామని, తిరిగి లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ వచ్చి ఈ బిజినెస్ మొదలుపెట్టామని ఆమె అన్నారు. యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా వల్ల తనకు ఎంత పాపులారిటీ లభించిందో అంతే నష్టం జరిగేలా అనిపిస్తోందని నిన్న 50,000 రూపాయల ఫుడ్ అమ్ముకునే అవకాశం లేకుండా పోలీసులు సీజ్ చేశారని ఆమె చెప్పారు. తన కుమారుడి మీద కూడా చేయి చేసుకున్నట్లు ఆమె పేర్కొనడం గమనార్హం. ఏదైతేనేం ఒక సింగర్ ఇంట్లో వంట మనిషిగా మొదలు పెట్టిన ఆమె ఈరోజు సీఎం గుర్తించిన ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అవడం మామూలు విషయం కాదు.