Jagdeep Dhankhar: దేశంలోనే రెండో అత్యున్నత పదవికి పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి సంచలనం సృష్టించిన వ్యక్తి మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖఢ్. ఆయన గత నెలలో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. నాటి నుంచి ఆయన ఇప్పటి వరకు ఎక్కడ బహిరంగంగా కనిపించలేదు, కనీసం చిన్న ప్రకటన కూడా చేయలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని చాలా మంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా దీనిపై చర్చనడుస్తుంది. ఆయన క్షేమంగానే ఉన్నారా అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.. వాటికి సమాధానమే ఈ స్టోరీ..
READ ALSO: Modi foreign visit schedule: ఆగస్టు 29 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. ఏయే దేశాలకు అంటే..
క్షేమంగా ఉన్న జగదీప్ ధన్‌ఖఢ్..
జగదీప్ ధన్‌ఖఢ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన ఇప్పటికీ ఢిల్లీలోని ఉపాధ్యక్షుడి నివాసంలోనే ఉన్నారు. ఆయన క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నారని, అలాగే టేబుల్ టెన్నిస్ కూడా ఆడుతున్నారని వారు చెప్పారు. ఆగస్టు 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ధన్‌ఖఢ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన టేబుల్ టెన్నిస్ ఆడటం ఒక అభిరుచిగా ప్రారంభించారని, ఆయన రోజు వారి దినచర్య గురించి తెలిసిన వ్యక్తులు చెప్పారు. జగదీప్ ధన్‌ఖఢ్ ప్రస్తుతం సెంట్రల్ విస్టా కింద నిర్మించిన ఉపాధ్యక్షుడి నివాసంలోనే ఉంటున్నారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఆయన ప్రస్తుతం ఉంటున్న నివాసాన్ని వదిలి వెళ్లవలసి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఆయన ఇంకా కొత్త బంగ్లా కోసం అభ్యర్థించలేదని సమాచారం. కానీ మంత్రిత్వ శాఖ ఆయన కోసం ఒక బంగ్లాను ఎంపిక చేసింది. ఇది ఢిల్లీలోని APJ అబ్దుల్ కలాం రోడ్‌లో ఉన్న టైప్-8 బంగ్లా. ఆయన ఈ భవనానికి మారితే ఓకే, లేకుంటే మరికొన్ని భవనాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ పదవీకాలం ఆగస్టు 10, 2027న ముగియనుంది. కానీ ఆయన జూలై 21న ఆరోగ్య కారణాలతో అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఈక్రమంలో తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించగా, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా కూటమి’ ఆయనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది.
READ ALSO: Amit Shah: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్‌షా తీవ్ర ఆరోపణలు..