Amit Shah: కొచ్చిలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ సుదర్శన్ రెడ్డి వామపక్ష తీవ్రవాదానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఒత్తిడితో సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని అన్నారు. ఆయన అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కేరళలో కాంగ్రెస్ విజయానికి మిగిలి ఉన్న అవకాశం కూడా చేజారిపోయిందని విమర్శించారు.
వామపక్షాల ఒత్తిడితోనే..
అమిత్ షా మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదానికి సహాయం చేయడానికి సల్వా జుడుం లాంటి తీర్పులు ఇచ్చిన వ్యక్తి ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ఆ రోజు ఆయన అలాంటి నిర్ణయం తీసుకోకపోతే 2020 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతమై ఉండేదని పేర్కొన్నారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసిందని ఆరోపించారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక ప్రసిద్ధమైన తీర్పులు ఇచ్చారు. వాటిలో సల్వా జుడుం కేసు చాలా ముఖ్యమైనది. 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్లతో కూడిన ధర్మాసనం సల్వా జుడుంను రద్దు చేసింది. సల్వా జుడుం అనేది.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొంతమంది గిరిజన యువకులను మావోల తిరుగుబాటును ఎదుర్కోవడానికి ప్రత్యేక పోలీసు అధికారులు (SPOలు)గా నియమించిన సంస్థ. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్లతో కూడిన బెంచ్ ఈ సంస్థను చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
READ ALSO: Fake CBI Officers crime: ఢిల్లీలో నకిలీ సీబీఐ అధికారుల చేతివాటం.. రూ.2.5 కోట్లతో జంప్