Minister Bala Veeranjaneya Swamy: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్‌కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
Read Also: AP Vision Document-2047: ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్..
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అంద విద్యార్థులకు ఒకేషనల్, స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్ జెండర్‌లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.
దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని.. అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. జిల్లా కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్‌కి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెల రూ.7000 పింఛన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సెక్రటరీ ఎ. సూర్య కుమారి, డిప్యూటీ డైరెక్టర్ డి.రవి ప్రకాష్ రెడ్డి, దివ్యాంగ కార్పొరేషన్ ఎండి ఎం.ఏ కుమార్ రాజా మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.