కేంద్రం సహాయంతో అయిదేళ్లలో ఆర్టీసీ (RTC)లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామని..త్వరలోనే 1400కొత్త బస్సులు రాబోతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎపీఎస్ ఆర్టీసీ (APSRTC)ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి ఆదివారం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కార్పొరేషన్ ఆస్తులను సద్వినియోగం చేసి ఆర్టీసీని లాభదాయకంగా మారుస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో మాదిరిగా లాభ దాయకంగా లేదని ఆర్టీసీని పక్కన బెట్టే చేతకాని ప్రభుత్వం తమది కాదన్నారు. లాభదాయకంగా లేదని బస్సులు రద్దు చేసే పరిస్థితులు ఉండవోద్దన్నారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు ప్రవేశ పెట్టేనాటికి పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Maharashtra Video: వామ్మో.. నడిరోడ్డుపైకి మొసలి.. హడలెత్తిపోయిన జనాలు
రాష్ట్రంలోని మహిళలకు త్వరలోనే తీపికబురు చెబుతామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి చెప్పారు. విశాఖపట్టణం నుంచే ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని, ఎలక్ట్రికల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను ఇప్పుడు స్థాపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.