తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పునకు, బీఆర్ఎస్ పార్టీగా మారనున్న టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాయిగా భావించిన మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నేతలు మార్కు ప్రదర్శించారు. బాధ్యతలు చేపట్టిన ప్రతిచోట లీడ్ లో దక్కించుకొని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి తమదైన మార్క్ చూపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ను నింపింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా చాలా మంది నేతలంతా మునుగోడులో ప్రచారం నిర్వహించారు. అధిష్ఠానం వారికి ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి తమ మార్కు చూపించారు. వరంగల్ జిల్లాలో నేతలు ఇన్చార్జిగా వ్యవహరించిన గ్రామాల్లో పార్టీకి మెజార్టీని తీసుకొచ్చి తమ సత్తా చాటారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు హెూరా హోరీగా తలపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలంతా మునుగోడులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్య వతి రాథోడ్ లతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కార్పొరేషన్ చైర్మెన్లందరూ మునుగోడు లోనే బస చేసి పార్టీ గెలుపునకు అహరహం కృషి చేశారు. ఆద్యంతం రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కౌంటింగ్లోనూ ఈ ఉత్కంఠ కొనసాగింది. చివరకు 10 వేల పైచిలుకు మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
Read Also: Munugode MLA : రేపే ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తమ అధినేత ఇచ్చిన బాధ్యత ఎంత మేర పూర్తి చేశారో చెక్ చేస్తే వరంగల్ జిల్లా నేతల మార్క్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరో సారి తన సత్తా చాటారు.. తనకు బాధ్యత ఇచ్చిన గ్రామంలో 1000 ఓట్లకు వన్ సైడ్ టిఆర్ఎస్‌కు ఓట్లు పడేలా చేసి 457 ఓట్ల మెజారిని సాధించి తన మార్కు మరో సారి చాటుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన గ్రామాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించడంతో హర్షం వ్యక్తం అవుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి. రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తదితరులు వివిధ గ్రామాలకు ఇన్చార్జిలుగా వ్యవహరించారు. ఆయా గ్రామాల్లోనే మకాం వేసి పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు ఏ బాధ్యతలు అప్పజెప్పిన సమర్థంగా నిర్వహిస్తారనే పేరు ఉంది 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన స్వగ్రామం నుంచి 90% ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పడేలా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఎమ్మెల్సీ పోటి చేసిన ఆయన సత్తా చాటారు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 90 శాతం ఓట్లు వన్ సైడ్ సాధించి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు.
Read Also: Bhatti Vikramarka Speech At Kotideepotsavam: కోటిదీపోత్సవం.. అద్భుతం అన్న భట్టి విక్రమార్క
మునుగోడు ఉప ఎన్నికల్లోను ఇదే సత్తా చాటారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఇంఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో వెయ్యి ఓట్లకుగాను 80 శాతం ఓట్లు టీఆర్ఎస్ కే పడేలా చేసి 457 ఓట్ల మెజార్టీని సాధించి నియోజకవర్గంలోనే టాప్ లో నిలిచారు. ఒకే గ్రామంలో 457 ఓట్ల మెజార్టీ సాధించిన ఘనత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి దక్కింది.. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పొర్లగడ్డతండా ఎంపిటిసి పరిధిలో టిఆర్ఎస్ 288 ఓట్ల మెజార్టీ లభించింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో 166 ఓట్ల మెజార్టీ సాధించడం గమనార్హం.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పల్లగుట్ట తండాలో టిఆర్ఎస్ కు 151 ఓట్ల లీడ్ను సాధించారు. 105వ బూత్లో టిఆర్ఎస్కు 265, బిజెపికి 251, 106వ బూత్లో టిఆర్ఎస్కు 120, బిజెపికి 123, 107వ బూత్లో టిఆర్ఎస్ 353, బిజెపికి 213, మొత్తంగా ఈ గ్రామంలో టిఆర్ఎస్కు 738, బిజెపికి 587 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 151 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దీంతో శంకర్ నాయక్, అనుచరులు ఆనందంలో మునిగితేలారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పలివెలలో బిజెపికి 400 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఈ గ్రామం బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అత్తగారి ఊరు కావడం గమనార్హం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు..అరూరి రమేష్.. వినయ్ భాస్కర్ లు ఇన్ఛార్జిగా వ్యవహరించిన చండూర్ మున్సిపాలిటీ లోటిఆర్ఎస్ కి మంచి మెజార్టీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు జోరుకి వరంగల్ నేతల స్ట్రాటజీ కారణం అంటున్నారు. మొత్తం మీద వరంగల్ టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారంటున్నారు.
(వరంగల్ ప్రతినిధి అరుణ్ కుమార్ సౌజన్యంతో)
Read Also: Tulasi: ఆలీ పెద్ద కంత్రీ.. నిక్కర్ బటన్ పెట్టుకోలేదని చెప్తే అలా చేశాడు