Tulasi: టాలీవుడ్ టాప్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇక వీటితో ఒక టాక్ షోకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ షో లో నాటి, మేటి నటీనటులు తమ గతం తాలూకు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా ఈ షో లో సందడి చేశారు సీనియర్ నటి తులసి, డార్లింగ్ ప్రభాస్ స్నేహితుడు ప్రభాస్ శ్రీను. డార్లింగ్ సినిమా అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారట. ప్రభాస్ శ్రీను, తులసిని అక్కా అని పిలుస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రోమో మొత్తం వినోదాత్మకంగా సాగింది. తులసి చిత్ర పరిశ్రమలోకి మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎంటర్ అయ్యిందని తెలిపింది.
” మూడు నెలల అప్పుడు సినిమాకు పరిచయమయ్యాను.. మూడు ఏళ్లకే డైలాగ్ చెప్పాను. వందేళ్ల సినీ పరిశ్రమలో నేను 56 ఏళ్ళ నుంచి ఉంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఆలీతో కలిసి చిన్నప్పుడే కలిసి నటించాను అని చెప్పిన తులసి ఆలీ ఒక సినిమా సెట్ లో చేసిన అల్లరి పనిని చెప్పుకొచ్చింది. ” నాలుగు స్తంభాలాట సినిమాసెట్ లో నాకు ఆలీ సైట్ కొట్టేవాడు.. నేను చెప్తున్నా.. ఇంత చిన్నగా ఉండేవాడు.. కానీ పెద్ద కంత్రీ” అని చెప్పగా ఆలీ “నేను అప్పుడు నిక్కరు వేసుకొని బటన్ పెట్టుకోలేదు.. అప్పుడు ఆమె చూసి.. ఒరేయ్.. బటన్ వేసుకోలేదురా అని నవ్వింది. వెంటనే నేను సౌండ్స్ చేసి ఏడిపించాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ శ్రీను మందు బాగా కొడతాడని, ఆ సమయంలో చేపలతో మాట్లాడతాడని చెప్పి నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.