YCRCP vs Janasena: విశాఖలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు ఫ్లెక్సీ వార్ నడిచింది. వైసీపీ, జనసేన అధినేతలను కించపర్చేలా ఫ్లెక్సీలు కనిపించడంతో ఆయా పార్టీల శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ విశాఖలోని ప్రధాన కూడళ్ళ దగ్గర వైసీపీ పోస్టర్లు వెలిశాయి. చంద్రబాబును పల్లకీలో మోస్తున్న పవన్ కల్యాణ్ అనే అర్ధం వచ్చేలా ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. దీంతో జనసైనికులు రంగంలోకి దిగారు. వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ హోర్డింగ్స్ పెట్టారు. వీటిలో కొన్నింటిని జీవీఎంసీ, మరికొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు తొలగించారు. అధికారపార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని లేకపోతే తాము ఏర్పాటు చేసిన వాటిని కొనసాగించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఆనందపురం జంక్షన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఆనందపురం కూడలిలో జనసేన అధినేత ఫ్లెక్సీని చింపడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలకు ఏ సాకూ దొరక్క వైసీపీ నేతలు ఇటువంటి ఫ్లెక్సీ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. భీమిలిలో ప్రశాంతతను చెడగొడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా, ముందస్తు ఎన్నికలు వచ్చినా భీమిలిలో జనసేన గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ నేతలు. రాత్రి అయ్యేసరికి ఫ్లెక్సీల రగడ మరింత ముదిరింది. అధికారపార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించనందుకు నిరసనగా సత్యం జంక్షన్ దగ్గర హైవేపై బైఠాయించారు జనసైనికులు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో జనసేన డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘుతో పాటు వీరమహిళలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు పోలీసులు. దీంతో సీన్ 4వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు మారింది. వైసీపీ నార్త్ నియోజకవర్గ సమన్వయకర్త కేకేరాజు తన అనుచరులతో పాటు స్టేషన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా పోస్టర్లు వేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆనందపురం జంక్షన్‌లో జనసేన కేడర్ పెద్దగా గుమిగూడటంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెల కొంది. బాహాబాహీకి ఇరువర్గాలు సిద్ధపడుతున్న తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు నెల్లూరులోనూ వైసీపీ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. పేదలకు.. పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అనే టైటిల్‌తో ఫ్లెక్సీ కట్టారు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు. చంద్రబాబును పల్లకిలో పవన్ కళ్యాణ్ మోస్తున్నారనే సంకేతాలు, చిత్రాలతో ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసేన నేతలు.. నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర పాపం పసివాడు పేరుతో ఫ్లెక్సీ పెట్టారు. 450 కోట్ల అవినీతి.. ఇసుక గ్రావెల్ రూపంలో అక్రమ సంపాదన, పేదల భూములను లాక్కోవడం లాంటి సబ్ టైటిల్స్ ను సైతం రాశారు. ఫ్లెక్సీల విషయం తెలుసుకున్న వెంటనే బాలాజీ నగర్ పోలీసులు వెళ్లి ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులను అడ్డుకునే యత్నం చేశారు జనసేన నేతలు. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని నిలదీశారు.
ఇప్పుడు ఫ్లెక్సీ వార్ ప్రకాశం జిల్లాకు పాకింది.. ఒంగోలులో చర్చి సెంటర్‌లో వైసీపీ, జనసేన పార్టీల మద్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది తొలగించారు.. ఒంగోలు నగరంలో పోటాపోటీగా వైసీపీ, జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని జనసేన పార్టీ కార్యకర్తలు ఒంగోలు చర్చి సెంటర్ లో ఆందోళనకు దిగారు.. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి వేశారు జనసేన కార్యకర్తల.. దీంతో.. పోలీసులు అడ్డుకున్నారు.. ఇక, పోలీసుల తీరుకు నిరసనగా ఒంగోలు వన్ టౌన్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టిన జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ సహా పలువురు కార్యకర్తలు.. ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు తలెత్తిన ఫ్లెక్సీల వివాదం ఇక్కడితో ముగుస్తుందా…? లేక టీడీపీ శ్రేణులు యాక్టివేట్ అవుతాయా అనేది ఉత్కంఠగా మారింది.