Vizianagaram Train Accident death toll rises to 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు రైళ్లు బయల్దేరిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఒకదానికిఒకటి ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 14కి చేరింది. 33 మందికి తీవ్ర గాయాలయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల సంఖ్య 100కి పైనే ఉంటుందని తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
విశాఖపట్నం-పలాస పాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కొత్తవలస రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరింది. భీమాళి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత అలమండ రైల్వేస్టేషన్ నుంచి సిగ్నల్ రాకపోవడంతో.. డ్రైవర్ రైలును ఆపేశాడు. అదే ట్రాక్‌పై సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో విశాఖపట్నం-రాయగడ పాసింజర్ కొత్తవలస నుంచి బయల్దేరింది. వేగంగా వస్తున్న విశాఖపట్నం-రాయగడ పాసింజర్ ముందు వెళ్తున్న విశాఖపట్నం-పలాస పాసింజర్ రైలును రాత్రి 7 గంటల సమయంలో వెనుక నుంచి భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య ఢీకొట్టింది. దీంతో పలాస పాసింజర్ వెనుక ఉన్న రెండు బోగీలు, రాయఘడ పాసింజర్ రైలు ఇంజన్‌తో పాటు మూడు బోగీలు పలాస రైలు మీద పడి నుజ్జునుజ్జయ్యాయి. కొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలు మీద పడ్డాయి. దీంతో అక్కడ పెను విషాదం చోటుచేసుకుంది.
Also Read: Atal pension yojana: తక్కువ పెట్టుబడితో, నెలకు రూ.5 వేలు పెన్షన్.. ఎలాగంటే?
కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 14 మృతదేహాలను బయటికి తీశారు. నుజ్జునుజ్జయిన బోగీల్లో మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. బోగీల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఒక లోకో పైలట్ ఉన్నట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా క్షతగాత్రులను 20 అంబులెన్స్‌ల్లో విజయనగరం, విశాఖల్లోని ఆస్పత్రులకు తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్లలో దాదాపుగా 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.