ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాల్ దాఖలు చేసిన అప్పీల్‌పై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read : Ram Gopal Varma : నేను కూడా పైరసీ చూస్తా – ఆర్జీవీ షాకింగ్ స్టేట్‌మెంట్ వైరల్ !
విశాల్ తరపున హాజరైన న్యాయవాదులు, తమ క్లయింట్ ధనవంతుడు కాదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ, “అయితే, విశాల్ దివాళా తీశారు (బ్యాంక్‌రప్ట్) అని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా?” అంటూ సూటిగా ప్రశ్నించింది. కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో, తాను ధనవంతుడిని కానని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక సమస్యలపై విశాల్‌ను హైకోర్టు నిలదీయడం ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.