NTV Telugu Site icon

IND vs NZ: చిరుతలా పరిగిత్తే కోహ్లీ జోరుకు బ్రేక్ పడిందా..? రనౌట్ వీడియో

Kohli

Kohli

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో చిరుతపులిలా పరుగెత్తడం చూస్తూ ఉంటాం. ఫీల్డింగ్ అయినా, వికెట్ల మధ్య అయినా వేగంగా పరుగులు తీస్తాడు. అయితే ఈరోజు చివరి టెస్టులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ జోరుకు బ్రేక్ పడినట్లుగా అనిపించింది. ఎందుకంటే.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ.. రనౌట్ అయ్యాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డైవింగ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు మ్యాట్ హెన్రీ వికెట్లకు డైరెక్ట్ త్రో కొట్టి కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు.

ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి.. రచిన్ రవీంద్ర వేసిన 19వ ఓవర్ మూడో బంతికి మిడ్ ఆన్ వైపు లైట్ షాట్ ఆడాడు. అతను సింగిల్ తీయడానికి ప్రయత్నించగా.. హెన్రీ పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకొని నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో కొట్టాడు. అయితే.. కోహ్లీ ఫుల్ డైవ్ చేసినా వికెట్ కాపాడుకోలేకపోయాడు. దీంతో.. తీవ్ర నిరాశతో కోహ్లీ గ్రౌండ్ వీడాల్సి వచ్చింది. 6 బంతులు ఆడిన కోహ్లీ.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో.. కోహ్లీ ఫామ్ చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు.

Read Also: Terrorist Attack In Budgam: ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు యువకులు మృతి

ఇదిలా ఉంటే.. ముంబై టెస్టులో తొలి రోజు భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశారు. అయితే ఈ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. 18 బంతుల్లో 18 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్‌కు తొలి దెబ్బ తగిలింది.

ఆ తర్వాత.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 52 బంతుల్లో 30 పరుగులు చేశాడు. భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను సెకండ్ డౌన్లో పంపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సిరాజ్ ఏమీ పరుగులు చేయకుండానే డకౌట్ అయ్యాడు. 18వ ఓవర్లో యశస్వి, సిరాజ్‌లు స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఓవర్లో ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (31), రిషబ్ పంత్ (1) ఉన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది.

Show comments