Kesineni Nani: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారం దూసుకెళ్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, మోపిదేవి వెంకటరమణ, మల్లాది విష్ణులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు తాను, వైసీపీ ముఖ్య నాయకులు అందరం కలిసి రోడ్డు షో నిర్వహించామని.. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.
తప్పకుండా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మంచి మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోడ్ షో ప్రచారంలా లేదని.. అవినాష్ విజయోత్సవ ర్యాలీలా ఉందని కేశినేని నాని పేర్కొన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన అన్నారు. కచ్చితంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుకి ఏడు అసెంబ్లీ సీట్లు.. ఒక ఎంపీ సీటు గెలిచి తీరుతామన్నారు. వైసీపీ 175కి 175 అసెంబ్లీ సీట్లు.. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతుందని వెల్లడించారు.