Bandaru Dattatreya Daughter: అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మీ గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి అభ్యర్థిగా బండారు విజయ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టారు. ఇవాళ ఉదయం విజయ లక్ష్మి ముషీరాబాద్ నియోజకవర్గ అభ్యర్తిగా దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి దరఖాస్తును బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ నుంచి పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి బీజేపీ అధిష్ఠానం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. బీజేపీ ఆశావహుల నుంచి వెల్లువలా దరఖాస్తుల సమర్పణ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శనివారం (నిన్న) ఒక్కరోజే 1,603 మంది దరఖాస్తులు వచ్చాయి. దీంతో గత ఆరు రోజుల్లో మొత్తం అందిన అప్లికేషన్ల సంఖ్య 3,223కు చేరుకుంది. నేడు (ఆదివారం) దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో దరఖాస్తులు భారీ సంఖ్యలోనే వస్తాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని పార్టీల్లోనూ ఆయనకు మంచి మిత్రులు ఉన్నారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్నింటికి మించి.. అలయ్ బలయ్ కార్యక్రమం బండారు దత్తాత్రేయకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఆయన కూతురు బండారు విజయలక్ష్మిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి అలయ్ బలయ్ ఫౌండర్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఆమె ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. గతేడాది అలయ్ బలయ్ సందర్భంగాఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని.. రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించే అంశంపై తుది నిర్ణయం బీజేపీదేనని విజయలక్ష్మి చెప్పారు. ఒక్క అలయ్ బలయ్ మాత్రమే కాకుండా.. బీజేపీ కార్యక్రమాల్లోనూ విజయలక్ష్మి పాత్ర పెరుగుతోంది.
పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలోనూ సందడి చేశారు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్లిపోకుండా.. పాదయాత్రలో ఎక్కువ రోజులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు విజయలక్ష్మి. ఇవన్నీ చూసిన కమలనాథులు.. దత్తాత్రేయ కుమార్తె రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నట్టు భావిస్తున్నారు. గతంలో తాము బీజేపీలో ఒక ఏరియా అనుకొని పనిచేయబోమని విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. తాము పార్టీ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆమె సనత్‌నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకుంది. బండారు దత్తాత్రేయ కూడా సనత్‌నగర్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే.. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి బలమైన నేతను ఢీకొట్టగలదా అనే చర్చ నడుస్తోంది. సనత్‌నగర్ ముచ్చట అలా ఉంటే.. కొత్తగా ముషీరాబాద్ నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. 2018లో ఇక్కడినుంచి పోటీచేసిన లక్ష్మణ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో అక్కడినుంచి పోటీ చేయడానికి కూడా తాను రెడీగానే ఉన్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాలే కాదు.. ఎక్కడి నుంచైనా పార్టీ అవకాశం ఇవ్వొచ్చు అని వ్యాఖ్యానించారు. కానీ.. అయితే సనత్‌నగర్ లేదా ముషీరాబాద్ నుంచే పోటీ చేయొచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ముషీరాబాద్ నియోజక వర్గం అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ కూమార్తె విజయ లక్ష్మి దరఖాస్తు చేసి అందరికి క్లారిటీ ఇచ్చారు.
Theft: ముఖానికి మాస్క్.. అంత జాగ్రత్తగా వచ్చి నువ్వు చేసిన దొంగతనం ఇదా?