Jagdeep Dhankar: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ నేడు (ఆదివారం) కందిలోని ఐఐటీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ (IIIT) డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, సమావేశ స్థలాలను పరిశీలించారు. ఉప రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, హెలిపాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడీ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవ్‌రావు, డీఎస్పీ సత్తయ్యగౌడ్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, డీపీవో సాయిబాబా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంబంధించి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి పర్యటన కోసం 550 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశామని వివరించారు.
అలాగే, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కంది నుంచి శంకర్‌పల్లి మీదుగా వెళ్లాలని.. ఆదివారం సాయంత్రం వరకు క్రషర్, మొరం వాహనాలు సంగారెడ్డిలోకి అనుమతించబోమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ క్రాంతి పేర్కొంటూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన విజ్ఞానం పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే వ్యర్థాలను ఉపయోగించి ప్రయోజనకరమైన ఉత్పత్తులను తయారు చేయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో భాగంగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కలెక్టర్ బీవీఎస్ మూర్తితో కలిసి సందర్శించారు.