Verit App: ఏది అసలు, ఏది నకిలీయే గుర్తించడం కష్టంగా మారింది ఈ రోజుల్లో.. మార్కెట్‌లో దొరికే ప్రతీ వస్తువులోనూ కల్తీ జరుగుతుందనే వార్తలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇక, లిక్కర్‌లోనూ నకిలీ హల్‌చల్ చేస్తోంది.. పెద్ద బ్రాండ్‌లనే టార్గెట్ చేసి కేటు గాళ్లు నకిలీ తయారు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. అంతే కాదు.. ఇక ఎన్నికల సమయంలో విచ్చిలవిడిగా పార్టీ కార్యకర్తలు, ఓటర్లకు లిక్కర్ పంపిణీ చేస్తూ వస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఈ లిక్కర్‌లో అసలు ఏది? కల్తీ ఏది? అనేది గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారిందట.. గతంలో నకిలీ మద్యం సేవించి ఎన్నికల తర్వాత అనారోగ్యం పాలై.. ఆస్పత్రుల చుట్టూ తిరిగినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ‘వేరిట్’ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఎక్సైజ్ శాఖ.
Read Also: NZ vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్.. కేన్ మామ వచ్చేశాడు! రసవత్తరంగా సెమీస్
ఇక, ‘వేరిట్’ యాప్‌పై నారాయణగూడ ఎక్సైజ్ సీఐ గీత ఓ ప్రకటన విడుదల చేశారు.. ప్లే స్టోర్ నుంచి ‘వేరిట్’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందినదా? కాదా? అనే విషయం తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అయితే, యాప్ ను ఎలా ఉపయోగించాలో కూడా ఆమె వివరించారు.. ‘వేరిట్’యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. అది ఏ రాష్ట్రానికి సంబంధించిన లిక్కరో ఇట్టే తెలిసిపోతుందన్నారు.. అంతే కాదు.. అది ఒరిజినలా? లేక నకిలీనా? అనే విషయం కూడా వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు అని తెలిపారు. ఇక, ఎన్నికల సమయంలో.. జోరుగా మద్యం పంపిణీ, అక్రమ మద్యం నిల్వలపై సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. దాని కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు ఎక్సైజ్ సీఐ గీత.