Vellampalli Srinivas: ఏ పార్టీలో చేరాలన్నది వైఎస్ షర్మిల ఇష్టం.. నిన్నటి వరకు ఆమె తెలంగాణాలో ఉన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఏం మాట్లాడుతారో చూడాలి అన్నారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని స్పష్టం చేశారు.. తన నియోజకవర్గ మార్పు, తాజా రాజకీయ పరిస్థితులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వెల్లంపల్లి.. పార్టీకి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తను.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని తెలిపారు. 15 ఏళ్లుగా విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేస్తున్నాను.. ఇప్పుడు నియోజకవర్గం మారాలంటే కొంత బాధగానే ఉంటుందన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యత ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో నేను, మల్లాది విష్ణు కలిసి సెంట్రల్ లో వైసీపీ జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్ ఎన్ని సమీక్షలు చేసినా ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్
విజయవాడ వెస్ట్‌లో అభివృద్ధి చేయలేదనే రిమార్క్ తో నన్ను మార్చలేదన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి చేశానన్న ఆయన.. సామాజిక సమీకరణలో భాగంగానే వెస్ట్ నుంచి మైనారిటీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఇక, వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అంటూ ఉండవు.. అందరూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గమే అన్నారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వైఎస్ షర్మిల చేరికపై స్పందిస్తూ.. సొంత బలం లేకుండా వలస వచ్చే నాయకుల కోసం చూసే వాటిని రాజకీయ పార్టీలు ఎలా అంటాం అని ప్రశ్నించారు. ఏ పార్టీలో చేరాలన్నది వైఎస్ షర్మిల ఇష్టం.. నిన్నటి వరకు ఆమె తెలంగాణాలో ఉన్నారు.. ఆమె ఏం మాట్లాడుతారో చూడాలన్నారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని వ్యాఖ్యానించారు. గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ నాయకులు అందరూ వచ్చేస్తారు అని గతంలో చంద్రబాబు అన్నారు.. కానీ, ఇప్పటి వరకు గేట్లు ఎందుకు తెరవలేదు? అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.